Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ 2022: ఆఫ్ఘాన్‌పై పాకిస్తాన్ ఉత్కంఠ విజయం... ఫైనల్‌కి పాక్, శ్రీలంక...

ఆఫ్ఘాన్‌పై ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న పాకిస్తాన్... ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించిన నసీం షా... ఫైనల్‌కి శ్రీలంక, పాకిస్తాన్... 

Asia Cup 2022: Pakistan beats Afghanistan Reaches final, Team India out of league
Author
First Published Sep 7, 2022, 11:05 PM IST

ఆసియా కప్ 2022లో టీమిండియా పెట్టుకున్న ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. ఆఫ్ఘాన్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో తలబడనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘాన్, టీమిండియా... నామమాత్రపు మ్యాచ్‌లో తలబడతాయి. 

130 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ జట్టుకి రెండో బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, ఫజల్ ఫరూకీ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 5 పరుగులు చేసిన ఫకార్ జమాన్ రనౌట్ అయ్యాడు. దీంతో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. 26 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...

ఇఫ్తికర్ అహ్మద్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు, షాదబ్ ఖాన్ 26 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ నవాజ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. కుష్‌దిల్ షాని ఫజల్‌హక్ ఫరూకీ క్లీన్ బౌల్డ్ చేయగా హరీస్ రౌఫ్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన ఫరీద్ అహ్మద్, 8 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసిన అసిల్ ఆలీని కూడా పెవిలియన్ చేరాడు...

దీంతో 113 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అయితే ఆఖరి ఓవర్‌లో నసీం షా... వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు. ఈ విజయంతో పాకిస్తాన్,శ్రీలంక... ఆసియా కప్ 2022 ఫైనల్‌కి అర్హత సాధించాయి. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి, రెహ్మనుల్లా గుర్భాజ్ కలిసి ఆఫ్ఘాన్‌కి మెరుపు ఆరంభం అందించే ప్రయత్నం చేశారు.

11 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘాన్. ఆ తర్వాత 17 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన హజ్రతుల్లా జజాయిని మహ్మద్ హస్నైన్ బౌల్డ్ చేశాడు...

19 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన కరీం జనత్, మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

కెప్టెన్ మహ్మద్ నబీని నసీం షా గోల్డెన్ డకౌట్ చేశాడు. అజ్మతుల్లా ఓమర్‌జై 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు, రషీద్ ఖాన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios