సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తగువులాడిన ఫరీద్ అహ్మద్, అసిఫ్ ఆలీ... ఇద్దరికీ 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ... 

ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 సమరం, హై ఓల్టేజీ మ్యాచ్‌ని తలపించింది. హోరాహోరీగా ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో ఒక్క వికెట్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది పాకిస్తాన్...

అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ బ్యాటర్ అసిఫ్ ఆలీ, ఆఫ్ఘాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అసిఫ్ ఆలీ వికెట్ తీసిన ఫరీద్ అహ్మద్, అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేకపోయిన పాక్ క్రికెటర్, తన బ్యాటు ఎత్తి ఫరీద్ అహ్మద్‌ని కొట్టేందుకు ప్రయత్నించాడు... 

అసిఫ్ ఆలీ బెదిరింపులకు బెనకని ఫరీద్ అహ్మద్, కదలకుండా అతన్ని కోపంగా చూశాడు. ఈ ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటుండగా కొందరు ఆఫ్ఘాన్ క్రికెటర్లు వచ్చి నిలువరించారు. ఈ సంఘటనలో అసిఫ్ ఆలీని తప్పుబట్టిన క్రికెట్ ఫ్యాన్స్, అతన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని కోరుతూ ‘#BanAsifAli’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు...

గ్రౌండ్‌లో కొట్టుకునేందుకు సిద్ధమైన ఈ ఇద్దరిపై జరిమానా విధించింది ఐసీసీ. ఆఫ్ఘాన్ క్రికెటర్ ఫరీద్ అహ్మద్, పాక్ క్రికెటర్ అసిఫ్ ఆలీలకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ, ఇద్దరికీ చెరో డీ మోరిట్ పాయింట్ వేసింది...

8 బంతుల్లో 16 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ, ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అసిఫ్ ఆలీని అవుట్ చేసిన ఫరీద్ అహ్మద్ అగ్రెసివ్‌గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు...

వికెట్ తీసిన తర్వాత అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కూడా తప్పేనా... అంటూ నిలదీస్తున్నారు ఆఫ్ఘాన్ క్రికెట్ ఫ్యాన్స్. తనని కొట్టడానికి వచ్చిన అసిఫ్ ఆలీని ఫరీద్ అహ్మద్ భయపడకుండా ఎదుర్కొన్నాడని, అందుకు ఎందుకు ఫైన్ వేస్తారంటూ ఐసీసీ ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

118 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అయితే ఆఖరి ఓవర్‌లో నసీం షా వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు.ఇంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో 3 సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు అసిఫ్ ఆలీ... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో పాటు ఆసియా కప్ 2022 టోర్నీలోనూ భారీ అంచనాలతో బరిలో దిగింది ఆఫ్ఘానిస్తాన్...

గ్రూప్ స్టేజీలో అద్భుత విజయాలు అందుకున్న ఆఫ్ఘాన్, పాకిస్తాన్‌ని ఓడించి ఫైనల్ చేరుతుందని భావించారంతా. ఫామ్‌లో లేని శ్రీలంక కంటే ఆఫ్ఘాన్, పాకిస్తాన్, భారత్‌లకే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్, శ్రీలంక ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌లో తలబడుతున్నాయి.