ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠభరిత పోరు సాగిన విషయం తెలిసిందే. అయితే చివరివరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా తన ధనాధన్ షాట్లతో విరుచుకుపడి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇలా గెలుపు ముంగిట నిలిచిన బెంగళూరు జట్టును ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితే కీలక సమయంలో తన అనవసరమైన సలహాతో కోచ్ ఆశిశ్ నెహ్రా ఓటమి అంచుల్లోని నెట్టాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీని తన పని తాను చేసుకోనిచ్చి వుంటే ఫలితం మరోలావుండేదేమోనని వారు అభిప్రాయపడుతున్నారు. 

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి మొదట బ్యాటింగ్ కు దిగి 171 పరుగులు చేసింది. దీంతో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభమే అందించారు. వారిద్దరు ఔటైన తర్వాత ముంబై బ్యాట్ మెన్స్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడటంతో పాటు ఒకరివుంట ఒకరు పెవిలియన్ కు చేరారు. దీంతో చివరి ఓవర్లలో మ్యాచ్ ఆర్సిబి వైపు మొగ్గింది. 

చివరి రెండు ఓవర్లలో ముంబై గెలుపుకు 22 పరుగులు అవసరమున్న సమయంలోనే నెహ్రా తలదూర్చి ఆర్సిబి ఓటమికి కారణమయ్యాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ వుండటాన్ని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ కోహ్లీ 19వ ఓవర్‌‌ను పేసర్ నవదీప్ సైనీతో వేయించాలని భావించాడు. అయితే కోచ్ నెహ్రా మాత్రం పవన్ నేగీతో వేయించాలని డగౌట్ నుంచే కోహ్లీకి సూచించాడు. దీంతో అతడి సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న కోహ్లీ నేగీ చేతికి బంతి అందించాడు. 

ఆ నిర్ణయమే ఆర్సిబి కొంప ముంచింది. ఈ ఓవర్ మొత్తం స్ట్రైకింగ్‌లో ఉన్న పాండ్యా వచ్చిన బంతిని వచ్చినట్లూ బౌండరీకి తరలించాడు. ఇలా రెండు ఓవర్లలో సాధించాల్సిన 22 పరుగులను అదే 19 ఓవర్లోనే పిండుకున్న పాండ్యా మరో ఓవర్ మిగిలుండగానే ముంబైని విజయతీరాలకు చేర్చి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. దీంతో ఈ ఓవర్ వేసిన  నేగీని, వేయించిన కోహ్లీని కాకుండా తప్పుడు సలహా ఇచచ్చిన నెహ్రాపై అభిమానులు ఆగ్ఱహం వ్యక్తం చేస్తున్నారు.