Asianet News TeluguAsianet News Telugu

The Ashes: బెయిర్ స్టో సెంచరీ.. అయినా ఆధిక్యంలోనే ఆసీస్.. రసవత్తరంగా సిడ్నీ టెస్టు

Ashes Live: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ తరఫున తొలి సెంచరీ నమోదైంది. అయినా కూడా ఈ టెస్టులో ఇప్పటికీ ఆధిపత్యం ఆసీస్ దే... 

Ashes Live: Jonny Bairstow century lead England fightback, But Australia Still Leading In 4th Test
Author
Hyderabad, First Published Jan 7, 2022, 2:41 PM IST

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిడ్నీ టెస్టు రసవత్తరంగా  మారుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో శుక్రవార 65 ఓవర్లే సాధ్యమయ్యాయి. ఒకవైపు క్రమంగా వికెట్లు పడుతున్నా  ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ తరఫున అతడు తొలి సెంచరీ సాధించాడు.  140 బంతులాడిన బెయిర్ స్టో.. 103 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ తరఫున తురుపుముక్క అవుతాడని భావించినా వరుసగా విఫలమవుతన్న ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. ఎట్టకేలకు  ఈ ఇన్నింగ్సులో జూలు విదిల్చాడు. స్టోక్స్-బెయిర్ స్టో లు కలిసి ఇంగ్లాండ్ ను  ఆదుకున్నారు. 

13 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్ లో ఇంతవరకు మెరువని ఓపెనర్ హసీబ్ హమీద్ (6) స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (18) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టులో ఫామ్ లో ఉన్న బ్యాటర్ డేవిడ్ మలన్ (3) కూడా దారుణంగా విఫలమవ్వగా సారథి జో రూట్ డకౌట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 

 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్.. (91 బంతుల్లో 66.. 9 ఫోర్లు, 1 సిక్సర్) బెయిర్ స్టో కు జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ పేస్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కున్నారు. చాలా రోజుల తర్వాత తన సహజ ఆట ఆడిన స్టోక్స్.. ఈ ఇన్నింగ్స్ లో కామెరూన్ గ్రీన్ వేసిన బంతి వికెట్లకు తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో బతికిపోయాడు.  వీరిరువురూ కలిసి ఇంగ్లాండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఎడాపెడా  బౌండరీలు బాదుతూ ఊపుమీద కనిపించారు. 

ఐదో వికెట్ కు  స్టోక్స్-బెయిర్ స్టో లు 128 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని శతకాలపై కన్నేశారు. కానీ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన 50వ ఓవర్లో చివరిబంతికి స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్టోక్స్ ఔటైన వెంటనే  వికెట్ కీపర్ జాస్ బట్లర్ (0) కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. 

 

స్టోక్స్, బట్లర్ ఔటైనా  బెయిర్ స్టో పోరాటాన్ని ఆపలేదు. టెయిలెండర్ మార్క్ వుడ్ (41 బంతుల్లో 39) తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు.  ఇదే క్రమంలో 137 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అతడి టెస్టు కెరీర్ లో ఇది 7వ సెంచరీ. అంతేగాక  యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ తరఫున ఇదే తొలి శతకం కావడం విశేషం. గత 7 ఇన్నింగ్సులలో ఏ ఒక్క  ఇంగ్లాండ్ ఆటగాడు కూడా శతకానికి దగ్గరగా రాలేదు. కానీ బెయిర్ స్టో ఆ కరువును తీర్చాడు. బెయిర్ స్టో శతకంతో ఇంగ్లాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కు  ఇంకా 158 పరుగులు వెనుకబడే ఉంది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ లు తలో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్,  గ్రీన్, నాథన్ లియాన్ లు చెరో వికెట్ పడగొట్టారు. 

బెయిర్ స్టో, స్టోక్స్ ఆదుకున్నా ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఇంకా వెనుకబడే ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండగా..  రెండ్రోజుల ఆట మిగిలుంది. దీంతో ఆ జట్టు 158 పరుగులు చేసి తిరిగి ఆసీస్ కంటే ఆధిక్యం సాధించడం కష్టమే. మరోవైపు ఆసీస్.. నాలుగో రోజు తొలి సెషన్ లోపే ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్   ప్రారంభించి 300+ ఆధిక్యాన్ని పర్యాటక జట్టు మీద  నిలిపే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 416-8 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios