Ashes 2023: యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా  తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. 

యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న  రెండో టెస్టులో తొలి రోజు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది.  టపార్డర్ బ్యాటర్లు నిలకడగా రాణించడంతో తొలి రోజే ఆసీస్.. 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి  339 పరుగులు చేసింది.  బ్యాటింగ్ కు అనుకూలించే లార్డ్స్ పిచ్ పై   తొలి టెస్టు సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లు రాణించారు.  

లార్డ్స్ లో టాస్ ఓడి  ఇంగ్లాండ్ ఆహ్వానం మేరకు  బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో  తొలి రోజు ధాటిగా ఆడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (88 బంతుల్లో 66, 8 ఫోర్లు, 1 సిక్సర్)  హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖవాజా.. 70 బంతులు ఆడి  17 పరుగులే చేసి   జోష్ టంగ్ వేసిన అద్బుత డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఖవాజా నిష్క్రమణ తర్వాత  కొద్దిసేపటికే వార్నర్ ను కూడా టంగ్.. సూపర్ డెలివరీతో బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ కు బ్రేక్ ఇచ్చాడు.  కానీ  మార్నస్ లబూషేన్ (47)తో కలిసి స్టీవ్ స్మిత్ (149 బంతుల్లో 85 బ్యాటింగ్, 10 ఫోర్లు)  ఆసీస్ స్కోరుబోర్డును నడిపించాడు. ఈ ఇద్దరూ  మూడో వికెట్ కు 102 పరుగులు జోడించారు.  అయితే లంచ్ తర్వాత  లబూషేన్ ను  రాబిన్సన్ ఔట్ చేశాడు.  

లబూషేన్ ఔట్ అయినా   ఇటీవల భీకర ఫామ్ లో ఉన్న   మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (73 బంతుల్లో 77,  14 ఫోర్లు) ధాటిగా ఆడాడు.  స్మిత్ తో కలిసి  హెడ్  నాలుగో వికెట్ కు 118 పరుగులు జోడించాడు. మూడో సెషన్ లో ఈ ట్రావిస్ హెడ్ వేగంగా పరుగులు సాధించాడు. 

 

Scroll to load tweet…

మరో పది ఓవర్లలో తొలి రోజు ముగుస్తుందనగా ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్.. ఆసీస్ కు ఊహించని షాకిచ్చాడు.   ట్రావిస్ హెడ్ ను 75వ ఓవర్లో రెండో బంతికి  ఔట్ చేశాడు. హెడ్ ముందుకొచ్చి ఆడటంతో   బెయిర్ స్టో అతడిని స్టంపౌట్ చేశాడు.  అదే ఓవర్లో ఐదో బాల్ కు  కామెరూన్ గ్రీన్ (0) కూడా భారీ షాట్ ఆడబోయి అండర్సన్ కు క్యాచ్ ఇచ్చాడు.  అయితే  మరో వికెట్ పడకుండా అలెక్స్ కేరీ (34 బంతుల్లో 11 నాటౌట్)  జాగ్రత్తపడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి  ఆస్ట్రేలియా.. 83 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  339 పరుగులు చేసింది.  స్మిత్, కేరీ క్రీజులో ఉండటంతో పాటు కమిన్స్ కూడా  బ్యాటింగ్ చేయగలడు. దీంతో ఆసీస్ ఈజీగా 450  స్కోరు సాధించే అవకాశాలున్నాయి.ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్, రూట్ లు తలా రెండు వికెట్లు తీశారు.  రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.