ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా.. ఈ విషయంలో పఠాన్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ గెలుపులో స్టోక్స్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి విండీస్ ఓటమికి కారణమయ్యాడు.

ఈ నేపథ్యంలో స్టోక్స్ ని పొగుడుతూ పఠాన్ ఓ ట్వీట్ చేశాడు. స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్.. టీమిండియాకి అవసరమంటూ పేర్కొన్నాడు. 'బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ గనుక భారత్‌కు దొరికితే.. టీమిండియాకు తిరుగుండదు. భారత్‌ను ఓడించడం అసాధ్యంగా మారుతుంది' అని ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. అంటే భారత జట్టులో ఆల్‌రౌండర్లే లేరంటావా? అంటూ కామెంట్ చేశాడు. 

కాగా.. యూవీ ప్రశ్నకు పఠాన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. యువరాజ్ సింగ్ ఉండేవాడు కానీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని సమాధానమిచ్చాడు. దీనికి 'యువీ... నాకు తెలుసు నీ నుంచి ఇలాంటి సమాధానం వస్తుంది'అని బదులిచ్చాడు. దీనికి పటాన్ 'నాగురించి నీకు బాగా తెలుసు బ్రదర్'అంటూ కామెంట్ చేశాడు. కాగా.. వీరి సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.