ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై  కామెంటేటర్ సునీల్ గవాస్కర్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన చేసిన కామెంట్ పై బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించారు. సునీల్ గవాస్కర్ కామెంట్ పై అనుష్క శర్మ మండిపడ్డారు. 

 తన భర్త ఆటలోకి తననేందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. తనపట్ల గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయని మండిపడింది. గురువారం కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఘోర ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన కోహ్లీ.. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

ఈ క్రమంలో విరాట్‌ను విమర్శిస్తూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ అనూష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు. అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనూష్మ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది. ఉదయం నుంచి లెంజడరీ క్రికెటర్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనుష్కశర్మ కూడా ఇన్‌స్టా స్టోరీలో గవాస్కర్ తీరును తప్పుబట్టింది.

‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను మీరు గౌరవిస్తారనుకుంటున్నా. అప్పుడు నా పట్ల మీకు అలాంటి గౌరవం లేదా? గత రాత్రి నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ వద్ద చాలా పదాలు, కామెంట్స్ ఉండే ఉంటాయి. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా? 2020 వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను క్రికెట్‌లోకి లాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఆగుతాయో? గౌరవనీయులైన గవాస్కర్.. ఈ జెంటిల్ మెన్ గేమ్‌లో మీరో దిగ్గజం. మీరు నా పట్ల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు ఏం అనిపించిందో అది చెప్పాలనుకున్నా'అని అనుష్క ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. కాగా.. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఈ ఘటనపై విరాట్ కోహ్లీ మాత్రం స్పందించలేదు.