Asianet News TeluguAsianet News Telugu

ఆఖరి వన్డేలో ఫలితం తేలకుండానే సిరీస్ కివీస్ సొంతం.. టీమిండియాకు వరుణుడి షాక్

INDvsNZ: ఇండియా - న్యూజిలాండ్ మధ్య  వన్డే సిరీస్ వర్షార్పణం అయింది. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన  మూడో వన్డేను కూడా వరుణుడు వదల్లేదు.  దీంతో భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. 

Another washout in New Zealand, Kane Williamson and Co. Clinch The Series with 1-0
Author
First Published Nov 30, 2022, 3:04 PM IST

టీమిండియా ఫ్యాన్స్ అనుకున్నదే అయింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తాకింది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఆడిన ఆట కంటే ఎక్కువ భాగం వరుణుడే ఆడుకున్నాడు. తాజాగా క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో వరుణుడు  పదే పదే అడ్డుపడి మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలోన్యూజిలాండ్  18 ఓవర్ల వద్ద  ప్రారంభమైన వర్షం.. ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉండటంతో  ఫలితం తేలకుండానే మ్యాచ్ ను  నిలిపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో వన్డే సిరీస్ ను కివీస్ 1-0తో గెలుచుకుంది. టీ20 సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. 

ఈ సిరీస్ లో తొలి వన్డే ఒక్కటే సక్రమంగా జరుగగా ఆ మ్యాచ్ లో  న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తర్వాత రెండు మ్యాచ్ లు  వర్షార్పణమయ్యాయి. రెండో మ్యాచ్ లో  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. 4 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురిసింది. తర్వాత కొద్దిసేపటికి మ్యాచ్ ప్రారంభమైంది. 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో మళ్లీ 12 ఓవర్ల ఆటకే వాన కురిసింది. దీంతో మ్యాచ్ ను అర్థాంతరంగా నిలిపేశారు. 

ఇక మూడో వన్డే లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్త తెరిపినిచ్చిన వరుణుడు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అనుకోని అతిథిలా విచ్చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. 18 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురిసింది. ఆ సమయానికి కివీస్.. 1 వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది.  ఫిన్ అలెన్ (57) హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించినా.. డెవాన్ కాన్వే (38), కేన్ విలియమ్సన్ (0 నాటౌట్) లు క్రీజులో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది.  దీంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన ఆటగాళ్లు మళ్లీ  ఫీల్డ్ లోకి రాలేదు. 

 

వాన కురవడం, ఆగడం  చేస్తుండటంతో పలుమార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ ను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.  అయితే  మ్యాచ్ ముగిసే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ దే పైచేయిగా ఉంది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..  47.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది.డక్త్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 18 ఓవర్లు ముగిసే సమయానికి 54 పరుగులు చేస్తే చాలు. దానికి 50 పరుగులు ఎక్కువగా చేసిన న్యూజిలాండ్, 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకునేది. కానీ డీఎల్ఎస్ అప్లై చేయాలంటే  కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18 ఓవర్లకే ముగియడం గమనార్హం. మ్యాచ్ రద్దు కావడంతో కివీస్ సిరీస్ ను  1-0తో చేజిక్కించుకుంది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు,  47.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్‌మన్ గిల్  (13, శిఖర్ ధావన్ (28), రిషభ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6), దీపక్ హుడా (12) లు దారుణంగా విఫలమయ్యారు.  శ్రేయాస్ అయ్యర్ (49) ఒక్కపరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని ఫర్వాలేదనిపించగా.. వాషింగ్టన్ సుందర్ (51) చివర్లో ఆదుకుని  భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios