టీమిండియాలో స్థానం సంపాదించడం అన్నది ఎంతో మంది భారతీయ యువ క్రికెటర్ల కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. జాతీయ జట్టులోకి వెళ్లడానికి క్రికెటర్లు తమకు నచ్చిన మార్గాల్లో వెళుతుంటారు.

అలా వచ్చిన వారిలో ఎంఎస్ ధోనీ ఒకరు. స్పోర్ట్స్ కోటాలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి ఇండియన్ క్రికెట్ టీమ్‌లో అడుగుపెట్టాడు.

Also Read:సిక్స్ కొడితే 250 డాలర్లు.. అంతా వాళ్లకి డొనేట్ చేస్తా: ఆసీస్ క్రికెటర్ మానవత్వం

ఇప్పుడు అదే దారిలో మరో టికెట్ కలెక్టర్ కూడా టీమిండియాలోకి అడుగు పెట్టాలని ఊవ్విళ్లూరుతున్నాడు. ఢిల్లీకి చెందిన హిమాన్షు సంగ్వాన్ రంజీల్లో రైల్వేస్ తరపున ఆడుతూ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు.

ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు సాధించి సత్తా చాటి సెలక్టర్ల కంట్లో పడ్డాడు. తన ప్రదర్శనకు ఆసీస్ దిగ్గజం మెక్‌గ్రాత్ కారణం అంటున్నాడు సంగ్వాన్.  అతని పర్యవేక్షణలో తాను ఎన్నో బంతుల్ని వేశానని.. ఆ దిశలో తన బౌలింగ్ తప్పిదాలను సరిచేసుకున్నట్లు అతను తెలిపాడు.

ప్రత్యేకంగా నోట్స్ రాసుకుంటూ బౌలింగ్ దాడిని మెరుగుపరచుకున్నానని సంగ్వాన్ తెలిపాడు. ప్రతీ సెషన్‌లోనూ తనకు మెక్‌గ్రాత్ అండగా నిలిచాడని పేర్కొన్నాడు. టెక్నికల్‌ బౌలింగ్‌తో పాటు ఓపికగా ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై మెక్‌గ్రాత్ విలువైన సూచనలు చేశాడని తెలిపాడు.

Also Read:నేను నాటౌట్: క్రీజు వదలనంటూ శుభమన్ గిల్ పట్టు, అంపైర్‌పై తిట్ల దండకం

ఇక పృథ్వీషా, రహానే వంటి స్టార్‌ల ఔట్ చేసిన దాని గురించి సాంగ్వాన్ మాట్లాడుతూ.. పృథ్వీషా ఒక ఎటాకింగ్ ప్లేయర్, ఎప్పుడూ దూకుడుగానే ఆడటంపైనే షా దృష్టి పెడతాడు. దీనిని గుర్తు పెట్టుకుని పృథ్వీషా కొన్ని ఏరియాల్లో బంతుల్లో సంధించడంతో మంచి ఫలితం లభించిందని తెలిపాడు.

రహానే విషయంలో కూడా ఒక ప్రణాళికతోనే బరిలోకి దిగానని... ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన రహానేను బోల్తా కొట్టించేందుకు ఖచ్చితమైన ఏరియాల్లో బంతులు వేసినట్లు తెలిపాడు.