IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ కు ముందే ఆర్సీబీకి వరుస షాకులు తాకుతున్నాయి. మరో కీలక బ్యాటర్ కూడా ఈ సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ సీజన్ లో అయినా కప్ కొట్టాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆ జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు కీలక ఆల్ రౌండర్ విల్ జాక్స్.. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కాగా ఇప్పుడు మరో స్టార్ బ్యాటర్, స్టార్ బౌలర్ కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గత ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున 8 మ్యాచ్ లు ఆడి ఓ సెంచరీ చేసి మొత్తంగా 333 పరుగులు చేసిన రజత్ పాటిదార్.. ఈ సీజన్ లో తొలి అర్థభాగం ఆడేది అనుమానంగానే ఉంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్ లో అతడికి గాయమైంది.
మడమ గాయంతో పాటిదార్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ పొందుతున్నాడు. అతడు మరో మూడు నుంచి నాలుగు వారాల పాటు అతడు లీగ్ కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని ఎన్సీఏ వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాత గాయంపై మరోసారి సమీక్ష జరిపి ఎంఆర్ఐ స్కాన్ తో పరీక్షించిన తర్వాత గానీ అతడు ఐపీఎల్ ఆడేందుకు ఫిట్ గా ఉన్నాడా..? లేదా..? అన్న విషయంలో ఓ నిర్ణయానికి రానుంది ఎన్సీఏ. ఇదంతా జరగడానికి నాలుగైదు వారాలు పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో అతడు ఐపీఎల్ నుంచి దూరమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సీజన్ మొత్తానికి కాకపోయినా ఫస్టాఫ్ కు మాత్రం దూరంగానే ఉండనున్నాడు.

పాటిదార్ తో పాటు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హెజిల్వుడ్ కూడా ఈ సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన జోష్ హెజిల్వుడ్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తిరిగి సిడ్నీకి వెళ్లిపోయాడు. వన్డే సిరీస్ ఆడేందుకు కూడా రాలేదు. అతడి గాయంపై ప్రస్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఎటూ తేల్చుకోలేకపోతుంది. టోర్నీ మొత్తానికి కాకపోయినా కొన్ని మ్యాచ్ లకు హెజిల్వుడ్ దూరమవుతాడని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇద్దరితో పాటు జట్టుతో కలిసిన ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడటంపై అనుమానాలున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత గాయపడి సుమారు ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన కాలు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా తాను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని చెబుతున్నాడు. దీంతో అతడు ఈ సీజన్ లో ఎలా ఆడతాడోనని ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా ఈ సీజన్ లో ఆర్సీబీ.. ఏప్రిల్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తొలి మ్యాచ్ ఆడనున్నది.
