జట్టు మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్. వరుస ఓటములపై తీవ్ర అసహనం చేసిన ఆండ్రీ... మాది మంచి జట్టే కానీ చెత్త నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే వరుసగా ఓడిపోతామన్నాడు.

సరైన సమయంలో సరైన బౌలర్‌ను బౌలింగ్‌కు దించకపోవడమే తమ జట్టు పరాజయాలకు కారణమన్నాడు. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ తాము ఓడిపోవడంపై రస్సెల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

తమకున్న బౌలింగ్‌ వనరులతో ఏ జట్టునైనా 170 పరుగులకే పరిమితం చేయాలి.. లేకపోతే ముంబై లాంటి పటిష్ట జట్టుపై గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే అని వ్యాఖ్యానించాడు. తాము బ్యాటింగ్‌లో విఫలమవుతున్నామని వారు చెబుతున్నారు.

కానీ అది నిజం కాదు.. రక్షించుకోగల స్కోర్లనే తాము చేస్తున్నామని.. తమ బౌలర్లు దారుణంగా బౌలింగ్ చేయడం.. చెత్త ఫీల్డింగ్‌తో గెలిచే మ్యాచ్‌ల్ని చేజేతులా జారవిడుచుకుంటున్నామన్నాడు.

ఇలాంటి వాతావరణంలో తాను ఆడలేనని అందుకే హోటల్ రూంకే పరిమితమవుతున్నానని రస్సెల్ చెప్పాడు. ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు రస్సెల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.