40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన తెలుగు క్రికెటర్ సోముదల ఈశ్వర రావు... ఢిల్లీ క్యాపిటల్స్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించిన ఈశ్వర రావు..
అంతర్జాతీయ క్రికెటర్‌గా టీమిండియాకి ఆశపడిన క్రికెటర్లు ఎందరో మరెందరో. అయితే 130 కోట్ల మంది భారతీయుల్లో తుది జట్టులో టీమ్‌కి ఆడగలిగేది 11 మంది మాత్రమే. టీమ్‌లో చోటు దక్కించుకోలేని వారిలో టన్నుల్లో సత్తా ఉన్న ప్లేయర్లు వేల మంది ఉంటారు. అలాంటి వారిలో సోముదల ఈశ్వర రావు అలియాస్ ఈశ్వర్ ఒకడు. ఐపీఎల్‌లో సపోర్టింగ్ స్టాఫ్‌లో నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఈశ్వర్, ఆగస్టు 28న ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు..
ఈశ్వర్ వయసు 40 ఏళ్లు మాత్రమే. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి వచ్చి, బైక్ స్టాండ్ వేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఈశ్వర్ చనిపోయినట్టు అతని తల్లి రాములమ్మ చెప్పింది.
విశాఖపట్నంలోని గాజువాక ఏరియాకి చెందిన సోముదల ఈశ్వర్, సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి స్టార్ ప్లేయర్లతో సెల్ఫీలు, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి క్రికెటర్లతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు ఈశ్వర్ అకౌంట్‌లో కనిపిస్తాయి.
అయితే టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఈశ్వర్ పేరు వినలేదు. కడు పేదరికంలో జన్మించిన ఈశ్వర్, 10వ తరగతి తర్వాత పూర్తిగా క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టారు. తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావుతో కలిసి రంజీ ట్రోఫీ సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు ఈశ్వర్. అయితే వేణుగోపాల్ రావు, రంజీల్లో ఆడి, ఆ తర్వాత టీమిండియాకి కూడా ఆడాడు. ఈశ్వర్ మాత్రం టీమ్‌కి ఎంపిక కాలేక, నెట్ బౌలర్‌గా మారాడు..
150 కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేసే ఈశ్వర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ.. ఇలా చాలా మంది దిగ్గజ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి నెట్ బౌలర్‌గా ఉన్న ఈశ్వర్ మృతికి భారత క్రికెటర్ శ్రీకర్ భరత్ సంతాపం వ్యక్తం చేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో పాటు ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా సోముదల ఈశ్వర రావు మృతికి సంతాపం తెలియచేసింది. ఈశ్వర్ మృతదేహాన్ని దర్శించుకుని, నివాళి ఘటించిన భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపింగ్ బ్యాటర్ శ్రీకర్ భరత్, ‘ఈశ్వర్‌తో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి అతను నెట్ బౌలర్‌గా ఉన్నాడు. తన బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఈశ్వర్ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్తాడని అస్సలు ఊహించలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు.
