కేవలం ఒక్క పదం 'క్లాస్'...: బౌలర్ సిరాజ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో, అంతకంటే గొప్ప నిర్ణయంతో అందరి మనసులు దోచుకున్నాడు.
కొలంబో : ఆసియా కప్ 2023 టోర్నీలో మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా టైటిల్ విజేతగా నిలిచింది. కేవలం ఆటతోనే కాదు మంచి మనసుతో తీసుకున్న నిర్ణయాలతో టీమిండియా ప్లేయర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి క్రికెట్ ఫ్యాన్స్ ను రోహిత్ సేన అలరిస్తే... అద్భుత ప్రదర్శనతోనే కాదు గొప్ప మనసును ప్రదర్శించిన యావత్ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు యువ బౌలర్ మహ్మద్ సిరాజ్. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా సిరాజ్ ను తనదైన స్టైల్లో ప్రశంసించారు.
ఆసియా కప్ ఫైనల్ ఆతిథ్య శ్రీలంక, భారత్ జట్ల మద్య కొలంబో వేదికగా ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక టాప్ ఆర్డర్ ను హైదరబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేకమేడలా కూల్చేసాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసాడంటేనే సిరాజ్ ఎలా రెచ్చిపోయాడో అర్థంచేసుకోవచ్చు. సిరాజ్ మ్యాజిక్ బౌలింగ్ ముందు నిలవలేక లంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే స్వల్ప లక్ష్యాన్ని చేధించి ఆసియా కప్ 2023 విజేతగా నిలిచింది.
Read More ఆసియాకప్ ఫైనల్ : సిరాజ్ స్పీడ్ పై ఢిల్లీ పోలీసుల ట్వీట్..!
అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇలా తనకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ కింద వచ్చే నగదును కొలంబో గ్రౌండ్ స్టాప్ కు అందించనున్నట్లు సిరాజ్ ప్రకటించాడు. ఇలా అంతకుముందే ఆటతో అభిమానుల మనసులు దోచుకున్న సిరాజ్ ఈ నిర్ణయంతో అందరి మనసులు దోచుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే వ్యాపారవేత్త ఆనంద్ మహీద్ర ఈ హైదరాబాదీ బౌలర్ పై ప్రశంసలు కురిపించారు.
''కేవలం ఒక్క పదం : క్లాస్. ఇది మీ సంపదను చూసుకునో, బ్యాగ్రౌండ్ చూసుకునో తీసుకున్న నిర్ణయం కాదు. మనసుతో తీసుకున్న నిర్ణయం'' అంటూ బౌలర్ సిరాజ్ ను ఉద్దేశించి ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసారు. అంతకుముందు సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనపైనా మహీంద్ర స్పందించారు. ''నేను ఎప్పుడూ ప్రత్యర్థుల గురించి బాధపడలేదు. కానీ ఫైనల్లో శ్రీలంక పరిస్థితి చూసి హృదయం ద్రవిస్తోంది. మనం ఓ అతీంద్రియ శక్తిని వారిపై వదిలినట్లుగా వుంది. మహ్మద్ సిరాజ్ ను చూస్తే మార్వెల్ అవేంజర్ లా కనిపిస్తున్నాడు'' అంటూ మహీంద్ర ఆసక్తికరమైన ట్వీట్ చేసారు.
ఇక మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన, గ్రౌండ్ స్టాప్ కోసం తీసుకున్న నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో మహేష్ బాబు, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా సిరాజ్ ను అభినందించారు.