Asia Cup 2022: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దేశంలో జరుగబోయే క్రికెట్ టోర్నీల నిర్వహణ లో మాత్రం వెనక్కి తగ్గేదేలేదంటున్నది
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా.. దేశంలో ఎమర్జెన్సీ విధించినా.. కర్ఫ్యూతో దేశమంతా నిర్బంధంలోకి వెళ్లినా తాము మాత్రం దేశంలో జరుగబోయే క్రికెట్ టోర్నీలను నిర్వహించి తీరుతామని అంటున్నది శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ). ఈ మేరకు ఇప్పటికే ఈనెల 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న పాకిస్తాన్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు జట్టును ప్రకటించిన ఎస్ఎల్సీ.. ఆసియా కప్ ను కూడా నిర్వహిస్తామంటున్నది. తమ దేశం నుంచి ఆసియా కప్ తరలిపోయే సవాలే లేదంటున్నది.
ఇదే విషయమై ఎస్ఎల్సీ సెక్రటరీ మోహన్ డి సిల్వ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ శ్రీలంకలోనే జరుగుతుందున్న నమ్మకం మాకుంది. మేము ఇటీవలే గాలేలో ఆస్ట్రేలియా సిరీస్ ను విజయవంతంగా నిర్వహించాం. త్వరలోనే పాకిస్తాన్ సిరీస్ ను కూడా విజయవంతం చేస్తాం..’అని చెప్పాడు.
ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆసియా కప్-2022 వేదికను శ్రీలంక నుంచి బంగ్లాదేశ్ కు మార్చేందుకు సన్నాహాలు చేస్తుందని.. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తో కూడా చర్చించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డి సిల్వ పై విధంగా స్పందించారు. అంతేగాక తమ దేశంలో ఎమర్జెన్సీ ఉన్నా క్రికెట్ కు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పాడు.
అయితే శ్రీలంక ఎంత చెబుతున్నా అక్కడ పరిస్థితులపై ఇతర దేశాలు మాత్రం లంక లో ఆసియా కప్ నిర్వహణపై మాత్రం పెదవి విరుస్తున్నాయి. రిస్క్ తీసుకోవడం ఎందుకు..? అనే ఆలోచనా ధోరణీతో ఆయా క్రికెట్ బోర్డులున్నాయి.
కాగా లంకలో ఆసియా కప్ నిర్వహిస్తారా..? లేదా..? అన్న విషయమై నేడు (జులై 15) తెలియనుంది. ఏసీసీ ప్రతినిధులు శుక్రవారం ఇదే విషయం మీద చర్చ జరుపుతారని తెలుస్తుంది.
ఇక ఆరుదేశాలు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకారమైతే ఆగస్టు 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీకి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ లు అర్హత సాధించాయి. ఆరో జట్టు కోసం హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ లు క్వాలిఫికేషన్ మ్యాచులు ఆడతాయి. ఆగస్టు 20నుంచి 26 వరకు ఇవి సాగుతాయి. ఈసారి ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో కాకుండా టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
