తెలుగు క్రికెటర్ అంబటి  రాయుడు అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ పునరాగమనం చేశాడు. అయితే అతడు టీమిండియా సెలెక్టర్లను, భారత క్రికెట్ వ్యవస్థను తప్పుబడుతూ క్రికెట్ నుండి వైదొలిగాడు. కానీ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని టీమిండియా క్రికెటర్ గా కొనసాగడానికి సిద్దమయ్యాడు. దీంతో అతడిపై అభిమానులు సోషల్ మీడియా వేదికలపై ''యూటర్న్ రాయుడు'' అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో రాయుడు ఇలాంటి విమర్శలను తిప్పికొట్టే  ప్రయత్నం చేశాడు. 

''నేను రిటైర్మెంట్ ని వెనక్కితీసుకుంటూ తీసుకున్న నిర్ణయం యూటర్న్ కాదు. దేశానికి తన సేవలను పరిపూర్ణంగా అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాలో క్రికెట్ ఆడే సత్తా చాలా వుంది...దాన్ని కేవలం దేశానికే అందించాలని నిర్ణయించుకున్నా. కాబట్టే భారీ ఆఫర్లను సైతం వదులుకుని మళ్లీ రిటైర్మెంట్ పై వెనక్కితగ్గాను. అంతేకానీ దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయలేదు. 

తాము నిర్వహించే క్రికెట్ లీగుల్లో పాల్గొనాలంటూ కొన్ని విదేశీ సంస్థలు నన్ను ఆహ్వానించాయి. భారీ మొత్తంలో ఆఫర్ కూడా చేశాయి. ఇలా కెనడా టీ20 లీగ్ నిర్వహకులతో పాటు కొన్ని టీ10 క్రికెట్ లీగ్ ల యాజమాన్యాలు నన్ను సంప్రదించాయి. వాటన్నింటిని తిరస్కరించి రిైటర్మెంట్ పై వెనక్కి తగ్గాను. 

ఇక నా ముందున్న లక్ష్యమల్లా హైదరాబాద్ తరపున రంజీల్లో రాణించడమే. ముందుగా దేశవాళి, ఐపిఎల్ లో భారీ పరుగులు సాధించడం ద్వారా అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నా. అందుకోసం శక్తివంచన లేకుండా కష్టపడ నాలోని అత్యుత్తమ ఆటగాన్ని బయటకు రప్పిస్తా.'' అని అంబటి రాయుడు వివరించారు. 

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ సమయంలోనే రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనను కాదని టీమిండియా సెలెక్టర్లు తమిళనాడు యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపికచేయడంపై రాయుడు తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాన్నే అంబటి రాయుడు ఇప్పుడు మళ్లీ వెనక్కితీసుకున్నాడు.