మిస్టర్ 360 ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. డుప్లిసిస్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, డి కాక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక కూడా... సఫారీ జట్టుకు మునుపటి స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. 

వన్డే వరల్డ్‌కప్‌లో వరుస ఓటముల పాలైన సఫారీ జట్టు కష్టాలను చూసి, ఆ దేశ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీడీ ‘అవసరమైతే జట్టులోకి తిరిగి వచ్చేందుకు సిద్దమని’ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే అప్పుడు సఫారీ టీమ్ సున్నితంగా తిరస్కరించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఏబీ డివిల్లియర్స్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ టీమ్. శ్రీలంక‌తో జరిగే సిరీస్ కోసం జూన్ 1లోగా సిద్ధంగా ఉండాల్సిందిగా ఏబీడీకి సమాచారం అందించారు. 

ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ కోసం ఈ 36 ఏళ్ల స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయలేదు. అలాగే సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లు కూడా వచ్చే టీ20 వరల్డ్‌కప్ కోసం సిద్ధంగా ఉండాల్సిందిగా ఆ దేశ క్రికెట్ బోర్డు కోరింది.

ఐపీఎల్ రాబోతున్నందున అందుకే మేం ప్లేయర్లకు సమాచారం అందించామని...  ఐపీఎల్ ఆడిన తర్వాత జట్టుకు అందుబాటులో ఉండాలని కోరినట్టు బౌచర్ మీడియాకు తెలిపారు.  జూన్ మొదటి నుంచి శ్రీలంక టూర్ మొదలు కానుందని, ఇందుకోసం ఆటగాళ్లను సిద్ధంగా ఉండాలని కోరినట్టు కోచ్ బౌచర్ తెలిపాడు. ఎవరిని ఎంపిక చేస్తామనేది తర్వాతి విషయం కానీ వచ్చే వరల్డ్‌కప్‌లో స్థానం కోరుకుంటే,  జట్టుకోసం ఆడేందుకు మాత్రం అందరూ రెఢీగా ఉండాలని బౌచర్ అభిప్రాయపడ్డాడు.  

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నానని ఏబీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ‘నేను, మళ్లీ నా టీమ్ కోసం ఆడడాన్ని ఎంతో ప్రేమిస్తాను. నేను ‘బౌచర్’ (సఫారీ కోచ్), గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రకా క్రికెట్ డైరెక్టర్), డుప్లిసిస్ (కెప్టెన్)లతో మాట్లాడుతున్నా... త్వరలోనే జట్టుకి ఆడతాననే ఆశతో ఉన్నా’ అంటూ ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్.  

2018, మార్చ్ 23న క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఏబీడీ, ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.