స్పోర్ట్స్ డెస్క్: ''అతడు మా టీం కెప్టెన్ కాకపోవచ్చు. కానీ అతడు తన ప్రదర్శనతో డిల్లీ క్యాపిటల్స్ జట్టును ముందుండి నడిపించి లీడర్ గా మారాడు'' అంటూ డిల్లీ ఓపెనర్ శిఖర్ ధవన్ పై స్టార్ ఆల్ రౌండర్ స్టోయినీస్ కొనియాడారు. తాను కూడా డిల్లీ టీం విజయవంతంగా ఇక్కడివరకు రావడంలో పాత్ర పోషించినప్పటికి ప్రముఖ పాత్ర శిఖర్ ధవన్ దే అని అన్నాడు. ఐపిఎల్ 2020 ఫైనల్లో కూడా ధవన్ ఇదే జోరు కొనసాగిస్తే తమ విజయం ఖాయమని స్టోయినీస్ స్పష్టం చేశాడు. 

ధవన్ ఈ ఐపిఎల్ సీజన్ 2020లో అద్భుతంగా రాణించి 603 పరుగులు బాదాడు. ఇందులో రెండ్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలున్నాయి. అలాగే ఈ సీజన్లో డిల్లీ ఫైనల్ కు చేరడంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టోయినీస్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. అతడు 12 వికెట్లు పడగొట్టడంతో పాటు 352 పరుగులతో రాణించాడు. అయితే తనకంటే ధవన్ ప్రదర్శనే జట్టుకు ఎంతో మేలు చేసిందని...డిల్లీ ఫైనల్ కు  చేర్చిన ఘనత అతడిదేనని నిన్న(ఆదివారం) సన్ రైజర్స్ తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో విజయం తర్వాత స్టోయినీస్ అభిప్రాయపడ్డాడు.

''అతడు(ధవన్) కెప్టెన్ కాకపోయినా జట్టులోని లీడర్. అతడు టీంలో వుంటే చాలు ఎనర్జీ దానంతట అది వస్తుంది. అంతేకాదు జట్టు సభ్యులతో అతడు తన అనుభవాన్ని పంచుకుంటూ క్రికెట్ జ్ఞానాన్ని పంచుతాడు. అతడు మా జట్టులో వుండటం గర్వంగా భావిస్తున్నా'' అన్నాడు స్టోయినీస్. 

''ఈ సీజన్లో ధవన్ 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లోనూ అతడు ఇదే ఆటను కొనసాగించి తమ జట్టుకు విజయాన్ని అందించి మొదటి ఐపిఎల్ ట్రోపీని అందిస్తాడు'' అని స్టోయినీస్ అభిప్రాయపడ్డాడు.