Asianet News TeluguAsianet News Telugu

ఒక్కటి కాదు రెండు కాదు.. వరుసగా ఆరుసార్లు మనమే విజేతలం.. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా రికార్డుల మోత

Women's Asia Cup 2022: పురుషుల ఆసియా కప్ ముగియడంతో  ఇప్పుడు అందరి కళ్లూ మహిళల టోర్నీ మీద పడ్డాయి. వచ్చే నెల 1 నుంచి 15 వరకు జరుగబోయే ఈ మెగా టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టుకు ‘ఘనమైన’ రికార్డులున్నాయి. 

Ahead Of Women's Asia Cup 2022 Look at The Stats and Records in This Mega Tourney
Author
First Published Sep 26, 2022, 3:07 PM IST

వచ్చే నెలలో జరిగే పురుషుల ప్రపంచకప్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కంటే ముందే మరో బడా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. అదే మహిళల ఆసియా కప్-2022.  అక్టోబర్ 1 నుంచి 15 వరకు  బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది.  ఈ మేరకు షెడ్యూల్, వేదిక, తదితర వివరాలు కూడా వెలువడ్డాయి. మరో ఐదు రోజుల్లో మొదలుకాబోయే ఈ టోర్నీలో టీమిండియాకు ‘ఘన’ చరిత్ర ఉంది. మహిళల ఆసియా కప్ ను భారత మహిళల క్రికెట్ జట్టు ఏకంగా  వరుసగా ఆరుసార్లు గెలుపొందింది.

అక్టోబర్ 1 నుంచి జరుగబోతున్న ఆసియా కప్-2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం  ఎలా సాగింది..? ఈ టోర్నీ ఎప్పట్నుంచి మొదలైంది..? ఇప్పటివరకు ఎన్ని టోర్నీలు జరిగాయి..? తదితర విషయాలు ఇక్కడ చూద్దాం. 

పురుషుల ఆసియా కప్ ను 1983 నుంచి ఆడుతుండగా మహిళల ఆసియా కప్ మాత్రం 2004లో ప్రారంభమైంది.  ప్రతీ రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న  ఈ టోర్నీని పురుషుల క్రికెట్ మాదిరిగానే  ఆ ఏడాది గానీ, వచ్చే ఏడాది గానీ  ఏ ప్రపంచకప్  (వన్డే, టీ20) ఉంటే ఆ ఫార్మాట్ లోనే ఆడిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు టోర్నీలు జరిగాయి. ఇందులో భారత్ తొలి ఆరు టోర్నీలను గెలుచుకోవడం విశేషం.  2018లో చివరిసారి జరిగిన ఆసియా కప్ ను బంగ్లాదేశ్  నెగ్గింది. 

ఆసియా కప్ లో భారత్.. 

- తొలి ఆసియా కప్ ను శ్రీలంకలోని కొలంబో, క్యాండీలలో (2004 లో- వన్డే ఫార్మాట్) నిర్వహించిన ఈ టోర్నీలో ఇండియా, శ్రీలంక మాత్రమే ఆడాయి.   ఐదు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గా జరిగిన ఈ  టోర్నీలో ఐదింటికి ఐదు గెలిచిన భారత్  విజేతగా నిలిచి తొలి ట్రోఫీని అందుకుంది. 
- 2005-06లో  ఈ టోర్నీ పాకిస్తాన్ లో జరిగింది. ఈ సారి ఇండియా, శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా ఆడింది. ఫైనల్లో భారత్.. శ్రీలంక మీద 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
- 2006లోనే జైపూర్ (ఇండియా) లో మూడో ఆసియా కప్ జరిగింది. పాల్గొన్న జట్లు ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్. ఫైనల్ ఇండియా-శ్రీలంక మధ్యే జరగగా  8 వికెట్ల తేడాతో భారత్ నే విజయం వరించింది. 
- 2008లో శ్రీలంక వేదికగా ముగిసిన టోర్నీలో బంగ్లాదేశ్ కూడా పాల్గొంది. నాలుగు దేశాలు ఆడిన ఈసారి ఫైనల్ మళ్లీ ఇండియా-శ్రీలంక మధ్యే జరిగింది. తుది పోరులో భారత్.. శ్రీలంకను ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో ఓడించింది. 

 

- 2012 నుంచి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్ లోనే సాగుతున్నది.  2012లో ఆసియా కప్ చైనాలో జరగడం విశేషం. ఈసారి జట్లు కూడా పెరిగాయి. ఇండియా, పాకిస్తాన్, థాయ్లాండ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, చైనాలు ఆసియా కప్ ఆడాయి. కానీ ఫైనల్ లో భారత్ - పాక్ తలపడ్డాయి. భారత్.. 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
- 2016లో  థాయ్లాండ్ వేదికగా  టోర్నీ జరగగా.. ఆరు జట్లు పాల్గొన్నాయి. చైనా, హాంకాంగ్ లు ఈ టోర్నీ ఆడలేదు. ఫైనల్ మళ్లీ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈసారి భారత్ 17 పరుగుల తేడాతో నెగ్గింది. 
- 2018లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్లాండ్, మలేసియా లు తలపడ్డాయి. ఫైనల్ ఇండియా-బంగ్లాదేశ్ మధ్య  జరిగింది. కానీ ఈసారి విజేత మారింది. ఫైనల్ లో బంగ్లాదేశ్.. భారత్ ను 3 వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో భారత  జోరుకు బ్రేకులు వేసి తొలి ఆసియా కప్ టైటిల్ గెలుచుకుంది.  

2020లో 8వ టోర్నీ జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా అది వరుసగా రెండేండ్లు వాయిదా పడుతూ వస్తున్నది. చివరికి అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్ వేదికగా  జరుగుతున్నది. ఈ టోర్నీలో ఏడు దేశాలు (ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, థాయ్లాండ్) లు బరిలో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios