Asianet News TeluguAsianet News Telugu

అంతా ఓకేనా..? ప్రపంచకప్‌కు టీమిండియా సెట్ అయినట్టేనా..?

IND vs AUS T20I: అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో  జరుగనున్న పొట్టి ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా జరిగిన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకుంది. సిరీస్ అయితే నెగ్గాం కానీ  ప్రపంచకప్ కు టీమిండియాలో అంతా  ఓకేనా..?  
 

Ahead Of T20I WC 2022, Is Everything Fine in Team India
Author
First Published Sep 26, 2022, 9:41 AM IST

పొట్టి ప్రపంచకప్ ను  తిరిగి భారత్ కు తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియా.. ఆ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడటానికి నేటికి సుమారు 25 రోజుల సమయముంది.అక్టోబర్ 23న  భారత జట్టు  పాకిస్తాన్ తో పోరుతో ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. అయితే ప్రపంచకప్ సన్నాహకంగా  స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది టీమిండియా. ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. సిరీస్ అయితే నెగ్గాం గానీ టీమిండియా.. ప్రపంచకప్ కు సిద్ధమైందా..? అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుందా..? అంటే సమాధానం మాత్రం ఇంకా లేదనే వినిపిస్తున్నది. 

ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ద్వారా వచ్చిన ఉపయోగాలేమిటో గానీ టీమిండియాకు మాత్రం మేలే జరిగింది. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా ఏ రంగాల్లో మెరుగ్గా ఉంది..? ఎక్కడ వీక్ గా ఉంది..? ఇంకా ఏ విభాగాల్లో మెరుగుపడాలి..? అసలు అధ్వాన్నంగా ఉన్న విభాగమేది..? అని విశ్లేషించుకునే అవకాశం దక్కింది.  

బ్యాటింగ్ ఓకే.. 

టీమిండియాకు ప్రధాన బలం బ్యాటింగే. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లతో  పాటు  మిడిలార్డర్ లో హార్ధిక్ పాండ్యా, ఫినిషర్ గా దినేశ్ కార్తీక్ లతో భారత బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తున్నది.  అయితే  మ్యాచ్ లో ఎవరో ఒక్కరో ఇద్దరో రాణిస్తున్నారే తప్ప కలిసికట్టుగా రాణించడంలో విఫలమవుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ వరకే తీసుకుంటే తొలి మ్యాచ్ లో రాహుల్, సూర్య, పాండ్యాలు రాణించారు. రోహిత్, కోహ్లీ విఫలమయ్యారు. రెండో టీ20లో  రోహిత్ రాణించాడు.  కోహ్లీ, రాహుల్, సూర్య, హార్ధిక్ లు నిరాశపరిచారు. హైదరాబాద్ లో సూర్య, కోహ్లీ లు రాణించగా హార్ధిక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కానీ రోహిత్,  రాహుల్ లు విఫలమయ్యారు. అయితే ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచే రోజులు కావివి. అదీగాక ఇది టీ20 ఫార్మాట్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. టాపార్డర్ లో కెఎల్ రాహుల్ తరుచూ విఫలమవడం ఆందోళన కలిగిస్తున్నది. కానీ మిగతావాళ్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. 

ఫీల్డింగ్ సో సో.. 

భారత ఫీల్డింగ్ ఈ సిరీస్ లో పేలవంగా ఉంది. మంచి ఫీల్డర్లుగా గుర్తింపు పొందిన కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తో పాటు రెండో టీ20లో విరాట్ కోహ్లీ కూడా ఓ క్యాచ్ మిస్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద  బంతులను ఆపడంలో ఫీల్డర్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆసియా కప్ లో కూడా అర్ష్దీప్ క్యాచ్ మిస్ చేయడం, శ్రీలంకతో మ్యాచ్ లో రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ కూడా ఈ జాబితాలో చేరేవే. సిరీస్ విజయంలో వీటిని మరుగున పెట్టడానికి వీళ్లేదు. 

 

బౌలింగ్.. అసలు బాధంతా దీంతోనే.. 

ప్రపంచ స్థాయి జట్లను గడగడలాడించిన టీమిండియా బౌలర్లు గత కొంతకాలంగా గాడి తప్పారు. మరీ ముఖ్యంగా మన పేస్ విభాగం అయితే దారుణంగా  విఫలమవుతున్నది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.  తొలి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చిన భువీ..  రెండో మ్యాచ్ లో ఆడలేదు. మూడో మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి 39 పరుగులు సమర్పించుకున్నాడు. తీసింది ఒక్క వికెట్ మాత్రమే. డెత్ ఓవర్లలో భువీ దారుణంగా విఫలమవుతున్నాడు. 

గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన బుమ్రా.. టీమిండియాతో అయితే చేరాడు గానీ ఇంకా కుదురుకోలేదు. నాగ్‌పూర్ లో  2 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చిన బుమ్రా.. హైదరాబాద్ లో అయితే 4 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చాడు. అతడి టీ20 కెరీర్ లోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన. హర్షల్ పటేల్ కథా ఇదే.. గత మూడు మ్యాచ్ లలో హర్షల్ ఇచ్చిన పరుగులు 49 (4 ఓవర్లు), 32 (2 ఓవర్లు), 18 (2 ఓవర్లు).. ఆసీస్ లో ప్రధాన బ్యాటర్లైన స్మిత్, మ్యాక్స్వెల్, ఇన్‌గ్లిస్ లు కూడా ఇన్ని పరుగులు చేయలేదు.

పేసర్ల సంగతి పక్కనబెడితే స్పిన్నర్ల పై లుక్కేస్తే ఈ సిరీస్ లో భారత్ కు జరిగిన ఒకే ఒక మంచి అక్షర్ పటేల్. మూడు మ్యాచ్ లలో కలిపి 8 వికెట్లు తీసి  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న అక్షర్.. ప్రపంచకప్ లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కానీ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మూడు మ్యాచ్ లలో చాహల్ ఇచ్చిన పరుగులివి 42, 12, 22.

తక్షణ కర్తవ్యం..!!

ఆసీస్ తో సిరీస్ ద్వారా టీమిండియాకు తెలిసొచ్చిన, తేలిపోయిన గొప్ప విషయం బౌలింగ్. ఈ తరహా బౌలింగ్ తో  ప్రపంచకప్ నెగ్గడం సంగతి పక్కనబెడితే గ్రూప్ స్టేజ్ దాటినా గొప్పే అనే  విషయం బోధపడింది. బౌలింగ్ లోపాలను చక్కదిద్దుకుని మన పేసర్లు తిరిగి ఫామ్ అందుకుంటే తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. ఫీల్డింగ్ పై సమీక్షించుకుని, బ్యాటింగ్ లో కూడా ఒకరిద్దరి మీద కాకుండా కలిసికట్టుగా ఆడటం మీద దృష్టి పెట్టాలి. అందుకు భారత్ కు ఉన్న అవకాశం దక్షిణాఫ్రికా సిరీస్ మాత్రమే.టీమిండియా ప్రయోగాల జోలికి పోకుండా జట్టును ప్రపంచకప్ కు సిద్ధం చేయడానికి ఈ మూడు టీ20లే కీలకం కానున్నాయి. అప్పుడే 15 ఏండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ఇండియాకు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. లేకుంటే మరో ‘దుబాయ్ వేదన’ (2021 టీ20 ప్రపంచకప్) అనుభవించక తప్పదు.

Follow Us:
Download App:
  • android
  • ios