IPL 2023: మరో నాలుగు వారాలలో  ఐపీఎల్ - 16వ సీజన్ కు తెరలేవనుంది.  ఈ సీజన్ కు   ముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు  ఊహించని షాక్ తగిలింది. 

గతేడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా టోర్నీ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతుంది. మార్చి 31న గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో ఆడబోతుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గతేడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో ఆ జట్టు రూ. 4.4 కోట్లు చెల్లించి దక్కించుకున్న ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ గాయంతో ఐపీఎల్ - 2023 ఆడేది అనుమానంగానే మారింది.

ఐర్లాండ్ తరఫున ఆడుతున్న ఈ యువ సంచలనం ఆ జట్టుకు ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ అద్భుతాలలో లిటిల్ పాత్ర ఎంతో ఉంది. కాగా లిటిల్.. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి గాయంతో తప్పుకున్నాడు. 

కొద్దిరోజుల క్రితమే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఎస్ఎ 20లో ఆడిన లిటిల్.. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున ఆడుతూ గాయపడ్డాడు. అయితే గాయాన్ని లెక్కచేయకుండా అతడు పీఎస్ఎల్ ఆడేందుకు వచ్చాడు. కానీ పాక్ కు వచ్చిన తర్వాత గాయం తగ్గకపోగా మరింత ముదిరింది. దీంతో అతడు హుటాహుటిన ఐర్లాండ్ బయల్దేరాడు. పీఎస్ఎల్ లో అతడు ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడుతున్నాడు. 

ఐర్లాండ్ క్రికెట్ ప్రతినిధి మార్క్ రౌసా తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎంఆర్ఐ స్కాన్ తీయగా అందులో లిటిల్ గాయం గురించి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. కానీ వచ్చే నెల(మార్చి)లో మా దేశానికి బంగ్లాదేశ్ రానున్నది. ఇది ఐర్లాండ్ కు చాలా కీలకమైన సిరీస్. ఈ సిరీస్ కోసం లిటిల్ సిద్ధమవ్వాలంటే కాస్త సమయం అవసరం..’అని చెప్పాడు.

Scroll to load tweet…

మార్చి 18 నుంచి బంగ్లాదేశ్ ఐర్లాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ నెల 31 దాకా ఈ సిరీస్ కొనసాగుతుంది. అయితే మార్చి 31నే భారత్ లో ఐపీఎల్ కూడా మొదలవుతుంది. ఆలోపు రిహాబిటేషన్ పూర్తి చేసుకుని ఫిట్నెస్ సాధిస్తేనే లిటిల్ ఐపీఎల్ లో ఆడే అవకాశముంటుంది. అదీగాక బంగ్లాదేశ్ తో సిరీస్ లో అతడు ఏ మేరకు ఫిట్నెస్ సాధించగలడు..? అసలు ఆ సిరీస్ ఆడతాడా..? లేదా..? అన్నది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం లిటిల్.. డబ్లిన్ లో ఉన్న రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. 

ఐర్లాండ్ తరఫున 22 వన్డేలు, 39 టీ20లు ఆడిన లిటిల్.. వరుసగా 33, 42 వికెట్లు తీశాడు. 2022 టీ20 ప్రపంచకప్ లో లిటిల్.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో హ్యాట్రిక్ పడగొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో లిటిల్.. కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ లను ఔట్ చేశాడు. ఐర్లాండ్ తరఫునే గాక ఇంగ్లాండ్ లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’లో కూడా లిటిల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో లిటిల్ (39) ముందున్నాడు. భువనేశ్వర్ (37), హసరంగ (34) లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐపీఎల్ లో ఆడనున్న తొలి ఐర్లాండ్ క్రికెటర్ గా లిటిల్ రికార్డులకెక్కాడు.