Commonwealth Games 2022: ఈనెల 28 నుంచి ఆగస్టు 9 వరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నవి 22వ కామన్వెల్త్ క్రీడలు.

ప్రతి నాలుగేండ్లకోసారి జరిగే క్రీడా కుంభమేళా కామన్వెల్త్ గేమ్స్. ఈనెల 28 నుంచి యునైటైడ్ కింగ్‌డమ్ (యూకే) లోని బర్మింగ్‌హోమ్ వేదికగా ప్రారంభంకాబోతున్న కామన్వెల్త్ క్రీడలు.. ఆగస్టు 9 వరకు జరుగుతాయి. 72 దేశాలు సుమారు 25 వరకు క్రీడాంశాలలో.. ఐదు వేలకు మందికి పైగా అథ్లెట్లతో నిర్వహించబోతున్న ఈ మహా క్రీడా మేళా కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి క్రీడాకారులు బర్మింగ్‌హోమ్ లోని క్రీడా గ్రామానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ క్రీడలు ఎప్పుడు మొదలయ్యాయి..? ఏ ఏ దేశాలు పాల్గొంటాయి..? తదితర ఆసక్తికర విషయాలు మీకోసం.. 

‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా బ్రిటన్ సామ్రాజ్యానికి గుర్తింపు. అంటే ఈ భూమండలం మీద సూర్యుడు వెలుగులు జిమ్మే ప్రతి దేశంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో బ్రిటన్ పాలకులు ఆధిపత్యం చెలాయించారు. అధికారికంగా బ్రిటన్ సామ్రాజ్యం కింద ఉన్న దేశాలు జరుపుకునే క్రీడలనే కామన్వెల్త్ క్రీడలు అని అంటారు. 

ఆ పేరెలా వచ్చింది..? 

ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటన్ పాలనలోనే ఉండేవనేది అందరికీ తెలిసిందే. ఆ దేశాలను అప్పుడు బ్రిటీష్ ఎంపైర్ (సామ్రాజ్యం) గా వ్యవహరించేవారు. కాలక్రమేణా అవి స్వతంత్ర దేశాలుగా మారాయి. వాటినే నేడు కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తున్నారు. ఈ జాబితాలో 53 దేశాలున్నాయి. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో ఆడబోయే దేశాలు మాత్రం 72.

ఎప్పుడు ప్రారంభమయ్యాయి..? 

- ఈ క్రీడలు 1930లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారిగా వీటిని కెనడా లోని హామిల్టన్ నగరంలో నిర్వహించారు. ఈ క్రీడలలో మొత్తంగా పాల్గొన్న క్రీడాకారులు 400 మంది. ఆస్ట్రేలియా, బెర్ముడా, బ్రిటీష్ గయానా, కెనడా, ఇంగ్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, సౌత్ ఆఫ్రికా, వేల్స్ లు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి.
- తొలి క్రీడలలో ఆరు క్రీడాంశాలను మాత్రమే చేర్చారు. అవి.. అథ్లెటిక్స్, బాక్సింగ్, లాన్ బోల్స్, రోయింగ్, స్విమ్మింగ్ అండ్ డైవింగ్, రెజ్లింగ్. 
- ఈ క్రీడలలో తొలి స్వర్ణం గెలిచింది కెనడాకు చెందిన ట్రిపుల్ జంపర్ గోర్డాన్ స్మాల్‌కోంబ్. 
- ప్రతి నాలుగేండ్లకోసారి జరిగే ఈ క్రీడలను మూడు పర్యాయాల తర్వాత 1942, 1946 లలో నిర్వహించలేదు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వీటిని వాయిదావేశారు. ఆ తర్వాత మళ్లీ వీటిని వాయిదా వేయకుండా నిర్వహిస్తూనే ఉన్నారు. జులై 28 నుంచి ప్రారంభంకాబోయేవి 22వ కామన్వెల్త్ క్రీడలు. 

ముందు పేరు వేరు.. 

ఇప్పుడు కామన్వెల్త్ క్రీడలు అంటున్నాం గానీ ప్రారంభం నుంచి ఈ క్రీడలను వివిధ పేర్లతో పిలిచారు. 

- 1930 నుంచి 1950 వరకు బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్ 
- 1954 నుంచి 1966 వరకు బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్
- 1970 నుంచి 1974 వరకు బ్రిటీష్ కామన్వెల్త్ గేమ్స్ 
- 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ గా కొనసాగుతున్నాయి. 

Scroll to load tweet…

మరికొన్ని ఆసక్తికర విషయాలు.. 

- కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఇవి ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కదాంట్లోనూ మిస్ కాకుండా ఆడుతున్న దేశాలు 6. అవి ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్. వివిధ సభ్య దేశాలు మధ్యలో కొన్నిసార్లు ఈ క్రీడల్లో పాల్గొనకున్నా ఈ ఆరు దేశాలు మాత్రం ఒక్కసారి కూడా తప్పుకోలేదు. 
- కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు గెలిచిన దేశం ఆస్ట్రేలియా. 2018లో ముగిసిన గోల్డ్ కోస్ట్ ఒలింపిక్స్ వరకు ఆ దేశం ఏకంగా 2,415 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 932 స్వర్ణాలు, 774 రజతాలు, 709 కాంస్య పతకాలున్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ (2,144), కెనడా (1,555) తర్వాత భారత్ 503 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. 
- 1930 నుంచి ఇప్పటివరకు కామన్వెల్త్ లో పలు క్రీడాంశాలను చేర్చారు. కొన్నింటిని తీసేశారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఉన్న క్రీడలలో అథ్లెటిక్స్, డైవింగ్, స్విమ్మింగ్ రెజ్లింగ్ మాత్రమే.