Virat kohli Test Average Under threat: భారత క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లు కూడా తమ కెరీర్ లో గడ్డుకాలం ఎదుర్కున్నా కోహ్లిలా మాత్రం...
టీమిండియా మాజీ సారథి తన కెరీర్ లో మునుపెన్నడూ ఎదుర్కోని ముప్పును ఎదుర్కోబోతున్నాడు. ఇన్నాళ్లు కోహ్లి పేరు చెప్పగానే అతడి అభిమానులంతా రొమ్ము విరుచుకుని చెప్పే మాట.. ‘కోహ్లి బ్యాటింగ్ సగటు అన్ని ఫార్మాట్లలో 50 కంటే ఎక్కువ..’ అని.. కానీ ఇప్పుడు అదే రికార్డుకు ముప్పు పొంచి ఉంది. శ్రీలంకతో జరుగబోయే రెండో టెస్టులో గనక అతడు 43 పరుగుల కంటే తక్కువ చేస్తే ఇక అంతే సంగతులు.. టెస్టులలో కోహ్లి సగటు 50 కి దిగువకు పడిపోనుంది. ఇప్పటికే రెండున్నరేండ్లుగా సెంచరీ కరువు తీర్చలేకపోతున్న కోహ్లి... దీనినైనా పట్టించుకుంటాడా..? లేక అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తాడా..? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.
అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఇప్పుడు 50 కి పైగా సగటుతో ఉన్నాడు. టెస్టులలో అతడి బ్యాటింగ్ యావరేజీ 50.35 గా ఉంది. కోహ్లి తన కెరీర్ లో వాంఖడే టెస్టులో తన 52వ టెస్టు ఆడుతుండగా 50 సగటు అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి 235 పరుగులు చేశాడు. టెస్టులలో అతడి కెరీర్ ఉత్తమ సగటు 2019లో నమోదైంది. 2019లో పూణెలో దక్షిణాఫ్రికా మీద 254పరుగులు చేసినప్పుడు కోహ్లి.. టెస్టులలో 55.10 సగటును నమోదు చేశాడు. అప్పట్నుంచి ఇది కాస్తా తగ్గుతూ వస్తున్నది.
కొన్నాళ్లుగా కోహ్లిలో మునపటి ఫామ్ కరువైంది. చివరిసారిగా కోహ్లి సెంచరీ చేసి 28 నెలలు దాటింది. 2019 లో ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో కోహ్లి సెంచరీ చేశాడు. అది అతడి 70వ సెంచరీ. ఆ టెస్టు తర్వాత కోహ్లి ఆడిన 29 ఇన్నింగ్సులలో కోహ్లి సగటు 28.75 గానే నమోదైంది.
శ్రీలంకతో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ అతడు మాత్రం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా 45 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక బెంగళూరు వేదికగా లంకతో జరుగబోయే రెండో టెస్టులో గనుక కోహ్లి 43 పరుగుల కంటే తక్కువ (42 చేసినా కూడా) చేస్తే టెస్టులలో అతడి సగటు 50 కి దిగువన పడిపోతుంది. ఆధునిక క్రికెట్ లో మరే ఇతర క్రికెటర్ కు సాధ్యం కాని రీతిలో అన్ని ఫార్మాట్లలో 50 ప్లస్ సగటు సాధించిన కోహ్లి.. మరి ఈ రికార్డును కాపాడుకుంటాడా....? ఒకవేళ అదే జరిగితే మాత్రం కోహ్లి ఆరేండ్ల తర్వాత అతడు 50 ప్లస్ సగటును కోల్పోతాడు.
మూడు ఫార్మాట్లలో కోహ్లి సగటు:
- టెస్టులు : 50.35
- వన్డేలు : 58.07
- టీ20లు : 51.50
వారికీ గడ్డుకాలం.. కానీ!
భారత టెస్టు క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లు ఎప్పుడూ తమ టెస్టు కెరీర్ లో 50 ప్లస్ సగటును కోల్పోలేదు. అప్పుడప్పుడు తమ కెరీర్ లో గడ్డుకాలం వచ్చినా వాళ్లు దానిని నిలబెట్టుకున్నారు. చివరికి గవాస్కర్ రిటైర్ అయ్యే సమయంలో అతడి టెస్టు సగటు 51.12 గా ఉంది. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సగటు (టెస్టులలో) 53.78గా ఉండగా రాహుల్ ద్రావిడ్.. 52.31 తో రిటైరయ్యాడు. మరి రికార్డులను, నెంబర్లను పెద్దగా పట్టించుకోనని చెప్పే కోహ్లి.. దీనిని పట్టించుకుంటాడా..? అంటే సమాధానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దొరుకనుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే కోహ్లికి అది సెకండ్ హోం గ్రౌండ్ వంటిది. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే కోహ్లికి ఆ గ్రౌండ్ తో ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది.
