సెంచరీ పూర్తి చేసుకుని అవుటైన రోహిత్ శర్మ... యశస్వి జైస్వాల్‌తో తొలి వికెట్‌కి 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓడిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకి వచ్చిన భారత జట్టు రికార్డుల దుమ్ము దులుపుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా అర్హత సాధించలేక, దిగాలుపడిపోయిన విండీస్ టీమ్‌ని ఆటాడుకుంటూ గణాంకాలను మెరుగుపర్చుకుంటోంది. తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్.. సెంచరీ అందుకోగా, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు..
రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌లో ఇది 10వ టెస్టు సెంచరీ కాగా, విదేశాల్లో రెండో టెస్టు సెంచరీ. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో మొట్టమొదటి విదేశీ టెస్టు సెంచరీ సాధించిన రోహిత్ శర్మ, రెండేళ్లకు వెస్టిండీస్‌లో శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్ టెస్టు కెరీర్‌లో చేసిన మిగిలిన 8 సెంచరీలు కూడా స్వదేశంలో వచ్చినవే..
220 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కి 229 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. వెస్టిండీస్‌పై టెస్టుల్లో మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2006లో వీరేంద్ర సెహ్వాగ్- వసీం జాఫర్ కలిసి విండీస్‌పై తొలి వికెట్‌కి 201 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ రికార్డును అధిగమించేశారు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ..
సెంచరీ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ, ఆరంగ్రేటం విండీస్ ఆటగాడు అలిక్ అథనజే బౌలింగ్‌లో జోషువా డి సిల్వకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన విండీస్‌కి ఫలితం దక్కింది.
104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 215 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు శిఖర్ ధావన్, 2013లో ఆస్ట్రేలియాపై, పృథ్వీ షా, వెస్టిండీస్‌పై 2018లో సెంచరీలు చేశారు. విదేశాల్లో టెస్టు ఆరంగ్రేటం చేసి, సెంచరీ బాదిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్.. .
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు, ప్రత్యర్థి జట్టు స్కోరు కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం జోడించడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌లో టీమిండియాకి ఇదే అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం కూడా.
8 ఏళ్ల తర్వాత విదేశాల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందు 2015 బంగ్లా టూర్‌లో మురళీ విజయ్, శిఖర్ ధావన్ సెంచరీలు చేసుకున్నారు. ఓవరాల్‌గా విదేశాల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేసుకోవడం ఇది ఆరోసారి.
