Asianet News TeluguAsianet News Telugu

అతిగా తిప్పితే అంతే మరి..! లక్నో పిచ్ క్యూరేటర్‌పై వేటు.. పోస్ట్ నుంచి తొలగింపు

INDvsNZ: బ్యాటర్లకు కఠిన పరీక్ష  పెట్టిన లక్నో పిచ్ పై ఇరు జట్లు కలిపి  వంద పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాయి. రెండు టీమ్ లు కలిసి  కనీసం ఒక్క సిక్సర్ కొట్టలేకపోయాయి. అరవీర భయంకర హిట్టర్లు కూడా వికెట్ కాపాడుకుంటే అదే పదివేలు అన్నట్టుగా ఆడారు. 

After Two Team Struggled in Batting, Lucknow Pitch Curator Removed From his Post MSV
Author
First Published Jan 31, 2023, 11:24 AM IST

ఇండియా-న్యూజిలాండ్  మధ్య రెండ్రోజుల క్రితం లక్నో లోని  శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా  స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ20లో  బంతి గింగిరాలు తిరిగింది. స్పిన్ అంటే ఓనమాలు తెలియని వాళ్లు బౌలింగ్ వేసినా షేన్ వార్న్ విసిరిన  బంతుల కంటే లక్నోలో బంతులు ఎక్కువగా స్పిన్ అయ్యాయి. బ్యాటర్లకు కఠిన పరీక్ష  పెట్టిన ఈ పిచ్ పై ఇరు జట్లు కలిపి  వంద పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాయి. రెండు టీమ్ లు కలిసి  కనీసం ఒక్క సిక్సర్ కొట్టలేకపోయాయి. అరవీర భయంకర హిట్టర్లు కూడా బతికి బట్టకడితే (వికెట్ కాపాడుకుంటే) చాలు అన్నట్టుగా  బ్యాటింగ్ చేశారు.  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన ఈ పిచ్ ను తయారుచేసిన క్యూరేటర్  పై  వేటు పడింది.  

పలు జాతీయ వెబ్‌సైట్ లలో వస్తున్న కథనాల మేరకు.. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్  లక్నో పిచ్ క్యూరేటర్ ను తన పోస్టు నుంచి తొలగించింది. ఇలాంటి వికెట్ ను తయారుచేసినందుకు గాను సదరు క్యూరేటర్ ను మందలించినట్టు కూడా తెలుస్తున్నది.   

 

ఐపీఎల్ కు కొత్త పిచ్.. 

ఈసారి ఐపీఎల్  కరోనా కంటే ముందు ఉన్న మాదిరిగా  జరుగనుంది. హోం అండ్ అవే (ఇంటా బయటా) పద్ధతిలో మ్యాచ్ లు జరుగుతాయి. అలా అయితే   ఐపీఎల్ లో గతేడాది ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఇదే హోం గ్రౌండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్  కు తయారుచేసిన పిచ్ ను  గనక ఐపీఎల్  మ్యాచ్ లకు తయారుచేస్తే  అది మొదటికే మోసం వస్తుందని  బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుతం క్యూరేటర్ ను తొలగించిన ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.. త్వరలోనే ఈ పిచ్ ను కూడా తీసేయనుంది. దాని స్థానంలో ఐపీఎల్ వరకు కొత్త పిచ్ ను తయారుచేస్తామని బీసీసీఐకి తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ఈ పిచ్ పై  లక్నో టీమ్ మెంటార్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో  టీ20 మ్యాచ్ జరుగుతుండగా.. ఇలాంటి పిచ్ ను చూస్తే దక్షిణాఫ్రికా ఆటగాడు, లక్నో తరఫున ఆడుతున్న క్వింటన్ డికాక్ అయితే మళ్లీ ఐపీఎల్ ఆడనని వెళ్లిపోతాడని అన్నాడు.  స్పిన్నర్లు అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ మాత్రం ఈ పిచ్ పై పండుగ చేసుకుంటారని   వ్యాఖ్యానించాడు. 

లక్నో వేదికగా ముగిసిన రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో  99 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో మిచెల్ శాంట్నర్ (19 నాటౌట్) టాప్ స్కోరర్.  లక్ష్య ఛేదనలో భారత్.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  101 పరుగులు చేసింది.   సూర్యుకుమార్ యాదవ్ (26 నాటౌట్) భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios