పాట్నా: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అనేక నిరసనలకు దారితీస్తుంది. ఢిల్లీలోని షహీన్ బాగ్ నుంచి మొదలుకొని ముంబై లోని మదనపుర వరకు దేశమంతా ఈ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలు, సభలను సమావేశాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీల మధ్యనే చిచ్చు పెట్టేంతలా, వాటిని చీల్చేంత స్థాయికి చేరింది. 

గత కొన్ని నెలలుగా జేడీయూ పార్టీ అధినాయకుడు నితీష్ కుమార్ కి, ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవికి తాజాగా రాజీనామా చేసిన పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కి మధ్య సంబంధాలు సరిగ్గాలేవన్న విషయం తెలిసిందే. ఈ పౌరసత్వ సవరణ చట్టమే వీరి మధ్య ఈ గ్యాప్ కి కారణం. 

పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతివ్వొద్దని ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ ని కోరినప్పటికీ... జేడీయూ ఎమ్మెల్యేలు మాత్రం పార్లమెంటులో ఆ చట్టానికి అనుకూలంగా ఓటు కూడా వేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ ఆ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరినప్పటికీ వారు వినలేదు. దానితో ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. 

అలా వారి మధ్య ఏర్పడ్డ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. వారి మధ్య ఉన్న గ్యాప్ కొనసాగుతున్నప్పటికీ అది అంతర్గతంగా మాత్రమే సాగేది. కానీ ఇప్పుడది బహిరంగ వేదిక మీదికి మారింది. 

తాజాగా నితీష్ కుమార్ రాజకీయంగా కాకపుట్టించే, ప్రశాంత్ కిషోర్ కి మంట పుట్టించే ఒక వ్యాఖ్య చేసారు. బీజేపీ నెంబర్ 2 గా కొనసాగుతున్న హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాల అనుసారంగానే ప్రశాంత్ కిషోర్ ని పార్టీలోకి తీసుకున్నట్టు నితీష్ కుమార్ అన్నారు. 

నితీష్ ఈ వ్యాఖ్య చేయగానే ప్రశాంత్ కిషోర్ కూడా ఘాటుగా స్పందించారు. పార్టీలో ఉండాలనుకుంటే... పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేయాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు అని ప్రశాంత్ కిషోర్ ని ఉద్దేశిస్తూ అన్నారు. 

ఆ వెనువెంటనే ప్రశాంత్ కిషోర్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఘాటుగా నితీష్ ని ఉద్దేశిస్తూ... ఒక వేళా మీరు చెప్పేది నిజమే అయితే... అమిత్ షా మనిషినయిన నా మాటనుపెడచెవిన పెట్టె ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా ఎన్నార్సి, ఎన్ పి ఆర్ లకు నో చెప్పమని నితీష్ కుమార్ ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది. 

బీహార్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ కన్నా జేడీయూకే అధిక సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే...! ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అసలు ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారు మాత్రమేనా లేక ఈయనకు ఏమైనా రాజకీయ ఆకాంక్షలున్నాయా అనే చర్చ బయట నడుస్తుంది.