IPL 2022 Play Offs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ లో పంజాబ్ గెలవడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆర్సీబీకి మాత్రం అది మరింత సంక్లిష్టమైంది.
ఐపీఎల్-2022 సీజన్ లో ప్లేఆఫ్స్ దగ్గరపడుతున్నకొద్దీ అవి ఆడే జట్లు ఏంటనేదానిమీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 9 విజయాలతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టగా.. లక్నో కూడా దాదాపు ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే.. కానీ మూడు, నాలుగు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు తర్వాత ఆడబోయే మ్యాచ్ డూ ఆర్ డై. ఆ మ్యాచ్ లో గెలిచినా ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడం గగనమే. ఇక అదే స్థానం కోసం పోరాడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా తమ తదుపరి అన్ని మ్యాచులను నెగ్గాలి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే.. గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచులాడి 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి మెరుగైన రరన్ రేట్ తో ప్లేఆఫ్స్ కు చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ (12 మ్యాచులు.. 8 విజయాలు.. 16 పాయింట్లు) కూడా బెర్త్ ఖాయం చేసుకున్నట్టే..
వచ్చిన చిక్కల్లా అక్కడే..
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో రాజస్తాన్ రాయల్స్ (12 మ్యాచులు.. 7 విజయాలు.. 14 పాయింట్లు), ఆర్సీబీ (13 మ్యాచులు.. 7 విజయాలు.. 14 పాయింట్లు) జట్లు తాము ఆడిన గత మ్యాచులలో ఓడి ప్లేఆఫ్ రేసును మరింత రసవత్తరం చేశాయి. రాజస్తాన్ తర్వాత రెండు మ్యాచులలో ఏ ఒక్కటి గెలిచినా దానికి బెర్త్ కన్ఫర్మ్. నెట్ రన్ రేట్ కూడా ఆ జట్టుకు ప్లస్ లలోనే ఉంది. కానీ ఎటొచ్చి ఆర్సీబీకే దెబ్బ పడేలా ఉంది.
7 మ్యాచులు గెలిచి 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ.. తర్వాత గుజరాత్ టైటాన్స్ ను ఢీకొననుంది. ఆ మ్యాచ్ లో గెలవడమొక్కటే సరిపోదు.. భారీ తేడాతో గుజరాత్ ను ఓడిస్తే అప్పుడు దానికి ప్లేఆఫ్ అవకాశాలుంటాయి. ఓడినా.. సాధారణ విజయం సాధించినా ఆర్సీబీ ఆశలు గల్లంతే.. ప్రస్తుతానికి ఆర్సీబీ నెట్ రన్ రేట్ మైనస్ (-0.323) లో ఉంది.
ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్..
పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. తర్వాత రెండు మ్యాచులు నెగ్గాల్సిందే. నెట్ రన్ రేట్ కూడా ప్లస్ లో ఉండటం దానికి సానుకూలాంశం. పంజాబ్ పరిస్థితి కూడా అంతే. కానీ సన్ రైజర్స్ తాము తర్వాత ఆడబోయే మిగిలిన మూడు మ్యాచులలో నెగ్గడమే కాదు.. భారీ తేడాతో నెగ్గాలి. బెంగళూరుతో ఇటీవల ముగిసిన మ్యాచ్ లో ఘోర పరాజయంతో హైదరాబాద్ నెట్ రన్ రేట్ తిరిగి మైనస్ (-0.031) కు పడిపోయింది.
ఈ మూడు జట్లు మిగిలిన మ్యాచులు గెలిస్తే..
ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లు తాము ఆడబోయే తదుపరి మ్యాచులలో మంచి విజయాలు సాధిస్తే ఆర్సీబీ.. గుజరాత్ పై గెలిచినా ఓడినా ఆర్సీబీకి ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టమవుతాయి. అప్పుడు ప్లేఆఫ్స్ లో నాలుగో స్థానం మరింత రసవత్తరమవుతుంది. ఇక మరో పది మ్యాచులు పది మ్యాచులు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో చివరివరకు ప్లేఆఫ్ కు వెళ్లేది ఎవరో ఉత్కంఠగానే ఉంటుందా..? లేక మధ్యలోనే తెలిసిపోతుందా అనేది మరో రెండు, మూడు రోజుల్లో తెలిసిపోనుంది.
