పెర్త్‌లోనే ముగిసిన పాక్ కథ..! సెమీస్ చేరాలంటే ఇలా.. గాలిలో దీపంలా ఉన్న ఆ అవకాశాలేంటంటే..!!
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు పరాజయాల పాలైన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే. కానీ ఆ జట్టుకు సెమీఫైనల్స్ చేరే అవకాశాలు ఇలా ఉన్నాయి.
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో సెమీస్ చేరిన పాకిస్తాన్.. ఈసారి మాత్రం తడబడుతున్నది. గత ఆదివారం మెల్‌బోర్న్ లో భారత్ తో ఉత్కంఠగా ముగిసిన పోరులో ఓడిన పాకిస్తాన్.. తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ లో కూడా ఒక్క పరుగు తేడాతో ఓడింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడటంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ సెమీఫైనల్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే. కానీ ఆ జట్టుకు సెమీస్ చేరడానికి ఇంకా అవకాశాలు మిగిలేఉన్నాయి. గాలిలో దీపం పెట్టి దేవుడును పూజించే విధంగా ఉన్న ఆ అవకాశాలేంటో ఒకసారి చూస్తే..
గ్రూప్-2 లో ఉన్న పాకిస్తాన్ రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ (-0.050) దారుణంగా ఉంది. ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలేంటో ఇక్కడ చూద్దాం.
- ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తర్వాత మ్యాచ్ లను నెదర్లాండ్స్ (అక్టోబర్ 30), సౌతాఫ్రికా (నవంబర్ 3), బంగ్లాదేశ్ (నవంబర్ 6) తో ఆడుతుంది. ఈ మూడు మ్యాచ్ లలో భారీ తేడాలతో గెలవాలి.
- మూడు మ్యాచ్ లు గెలిస్తే అవకాశం ఉంటుందా..? అంటే అదీ అనుమానమే. గ్రూప్ లో సెమీస్ కు పోటీ పడుతున్న ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడాలి. ముఖ్యంగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లో.. టీమిండియా సఫారీలపై (అక్టోబర్ 30న) గెలిస్తేనే పాక్ కు సెమీస్ అవకాశాలుంటాయి.
- అదొక్కటే కాదు.. జింబాబ్వే తన తర్వాత రెండు మ్యాచ్ లలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఓడితేనే పాక్ కు సెమీస్ ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మళ్లీ కథ మొదటికే.
- బంగ్లాదేశ్ కూడా రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. ఆ జట్టు తర్వాత మ్యాచ్ లు పాకిస్తాన్, జింబాబ్వే, ఇండియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లలో ఫలితాలు కూడా పాకిస్తాన్ జట్టు భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ మూడు మ్యాచ్ లు గెలిచినా ఓడినా పెద్ద తేడా అయితే కనిపించేట్టు లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది ప్రపంచకప్ లో ఆ జట్టు పరిస్థితి. వరుసగా రెండు విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్ రేసులో ముందంజలో ఉంది. టీమిండియా తర్వాత మ్యాచ్ లు సౌతాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ లతో ఉన్నాయి. ఈ మూడింటిలో సౌతాఫ్రికా ఒక్కటే కష్టమైన ప్రత్యర్థి. అదీగాక మూడింటిలో కనీసం ఒక్కటి గెలిచినా భారత్ సెమీస్ చేరుతుంది. దక్షిణాఫ్రికా కూడా రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో గెలిచి మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సఫారీలు తమ తర్వాతి మ్యాచ్ లను భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో ఆడనున్నారు. వీటి ఫలితాలను బట్టి పాకిస్తాన్ భవితవ్యం తేలనుంది.