Srilanka Cricket New Fitness Rules: లంకలో క్రికెటర్లు ఆ దేశ క్రికెట్ బోర్డు మధ్య కొత్త ఫిట్నెస్  రూల్స్ చిచ్చు పెడుతున్నాయి. దీనిని నిరసిస్తూ యువ ఆటగాళ్లు కూడా  రిటైర్మెంట్ కు సిద్ధపడుతున్నారు. 

శ్రీలంక క్రికెట్ ప్రవేశపెట్టిన కొత్త ఫిట్నెస్ నిబంధనలు ఆ జట్టు ఆటగాళ్లలో చిచ్చు రేపుతున్నాయి. ఆటగాళ్లను శారీరకంగానే గాక మానసికంగా దృఢంగా ఉంచేందుకని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఇటీవలే కొన్ని కొత్త ఫిట్నెస్ రూల్స్ ను తీసుకొచ్చింది. కానీ ఆటగాళ్లకు మాత్రం ఇవి ఏ మాత్రం రుచికరంగా లేవని తెలుస్తున్నది. ఈ ఫిట్నెస్ రూల్స్ కారణంగా నిన్నగాక మొన్నే శ్రీలంక యువ ఆటగాడు భానుక రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో లంక క్రికెటర్ దనుష్క గుణతిలక కూడా అతడి బాటలోనే పయనిస్తున్నాడు. ఈ ఇద్దరి వయస్పు 30 ఏండ్లే కావడం గమనార్హం. 

రాజపక్స మొత్తం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగగా.. గుణతిలక మాత్రం టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ కు లేఖ రాశాడు. అనంతరం స్థానిక వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. ‘జాతీయ జట్టుకు ఆడటం ఎప్పటికీ గొప్ప గౌరవంగా భావిస్తాను. రాబోయే రోజుల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చినప్పుడు ఉత్తమ ప్రదర్శన చేస్తాన’ని చెప్పుకొచ్చాడు. 

Scroll to load tweet…

శ్రీలంక తరఫున 8 టెస్టులాడిన 30 ఏండ్ల గుణతిలక.. 18.62 సగటుతో 299 పరుగులు చేశాడు. గతేడాది శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కుంటూ ఏడాది పాటు అతడు నిషేధం ఎదుర్కుంటున్నాడు. ఇంకా నిషేధం ముగియకముందే గుణతిలక మాత్రం తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. 

అయితే రాజపక్స మాదిరే కొత్త ఫిట్నెస్ నిబంధనలను నిరసిస్తూనే గుణతిలక టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తున్నది. శ్రీలంక క్రికెట్ ఇటీవల తీసుకొచ్చిన ఫిట్నెస్ నిబంధనలు ఆటగాళ్ల సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తున్నాయి. దీని ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు. 

ఇక శ్రీలంక టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గుణతిలక.. వన్డేలు, టీ20లలో కొనసాగుతానని తెలిపాడు. ఇప్పటివరకు లంక తరఫున 44 వన్డేలు ఆడిన అతడు 1,520 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక 27 టీ20 లు ఆడి 542 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి.