Asianet News TeluguAsianet News Telugu

టీ20 క్రికెట్‌లో అప్ఘాన్ విజయయాత్ర...నయా రికార్డు నమోదు

బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ట్రై సీరిస్ లో అప్ఘానిస్థాన్  అదరగొడుతోంది. రషీద్ ఖాన్ సారథ్యంలో వరుస విజయాలను అందుకుంటూ ఓ ప్రపంచ రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది.  

afghanistan set t20 world record in dhaka
Author
Dhaka, First Published Sep 16, 2019, 2:52 PM IST

అంతర్జాతీయ క్రికెట్లో ఇక తాము పసికూనలం కాదని అప్ఘానిస్థాన్ టీం సీనియర్ జట్లకు సంకేతాలు పంపిస్తోంది. తమదైన రోజున ఎంతటి బలమైన జట్టునయినా మట్టికరిపించగలమని బంగ్లాను వారి స్వదేశంలోనే ఓడించడం ద్వారా అంతర్జాతీయ జట్లన్నింటికి గట్టిహెచ్చరికను పంపించింది. ఇలా ఇప్పటికే ఏకైక  టెస్ట్ సీరిస్ ను కైవసం చేసుకున్న రషీద్ సేన తాజాగా టీ20 సీరిస్ ద్వారా ఓ అరుదైన వరల్డ్  రికార్డును నెలకొల్పింది. 

ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికన జరిగిన టీ20 మ్యాచ్ లో పర్యాటక అప్ఘాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను వారి స్వదేశంలోనే ధీటుగా ఎదుర్కొని 25 పరుగుల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. ఈ విజయం ద్వారా అప్ఘాన్ ఖాతాలోకి వరుసగా 12వ టీ20 విజయం చేరింది. ఇలా  2017 నుండి తమ పేరిట  వున్న(11 వరుస విజయాలు) టీ20 రికార్డును బద్దలుగొట్టిన అప్ఘాన్ నయా రికార్డును నెలకొల్పింది. 

ఢాకా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ అప్ఘాన్ మొదట బ్యాటింగ్‌ చేసి ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మహ్మద్ నబీ కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు బాదడంతో ఈ స్కోరు సాధ్యమయ్యింది. ఇక 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాను యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ కుప్పకూల్చాడు. ఈ 18ఏళ్ల యువ స్పిన్నర్ తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్  గణాంకాలను నమోదు చేసుకున్నాడు. అతడు కేవలం 15 పరుగులు మాత్రమే సమర్పించుకుని 4 వికెట్లతో  చెలరేగడంతో బంగ్లా కేవలం  139 పరుగులకే పరిమితమయ్యింది. 

అప్ఘానిస్థాన్ తన విజయయాత్రను 2019  పిబ్రవరిలో ప్రారంభించింది. తాత్కాలిక వేదికైన షార్జాలో జింబాబ్వేతో తలపడి రెండు మ్యాచ్ ల టీ20 సీరిస్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత బంగ్లాను 3-0 మరోసారి, ఐర్లాండ్ ను 2-0తో ఓడించింది. అలాగే ఈ ట్రై సీరిస్ కు ముందు కూడా ఐర్లాండ్ పై 3-0తేడాతో సీరిస్ ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ట్రైసీరిస్ లో మొదట జింబాబ్వేను 28 పరుగుల తేడాతో ఓడించిన అప్ఘాన్ తాజాగా ఆతిథ్య జట్టును కూడా ఓడించి వరుసగా 12వ విజయాన్ని అందుకుంది. దీంతో అప్ఘాన్ ఖాతాలోకి మరో నయా ప్రపంచ రికార్డు చేరింది.   

ఇదే బంగ్లాతో కొద్దిరోజుల క్రితం జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లోకూడా అప్ఘాన్ అద్భుతం చేసింది. బంగ్లా పులులను వారి స్వదేశంలోనే మట్టికరిపించి ఏకంగా 224 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇలా టెస్ట్ జట్టు హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిని గెలిచి అప్ఘాన్ చరిత్ర సృష్టించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios