ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డులో అవినీతిపై అసహనం వ్యక్తం చేసిన ఉస్మాన్ ఘనీ... సరైన మేనేజ్‌మెంట్ వచ్చేదాకా ఆఫ్ఘాన్ తరుపున క్రికెట్ ఆడనంటూ.. 

భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లకు చోటు దక్కకపోవడంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. సర్ఫరాజ్ ఖాన్‌ ఫిట్‌నెస్ సరిగా లేదని, అతని యాటిట్యూడ్ బాగోలేదని కామెంట్లు వినిపిస్తున్నా... బీసీసీఐ రాజకీయాల వల్లే అతను టీమ్‌లో రాలేకపోతున్నాడనేది ఎవ్వరూ కాదనలేని నిజం..

భారత క్రికెట్ బోర్డులో అవినీతి, రాజకీయాల గురించి ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అయితే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డులో అవినీతితో విసుగు చెందిన ఓ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి, సంచలనం క్రియేట్ చేశాడు. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడాల్సింది టీమిండియా..

అయితే ఐపీఎల్‌ ఆడి అలిసిపోయిన భారత జట్టుకి రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఆఫ్ఘాన్‌తో సిరీస్‌ని రద్దు చేసుకుంది టీమిండియా. దీంతో ఆఫ్ఘాన్, త్వరలో బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో ఆఫ్ఘాన్ యంగ్ ఓపెనర్ ఉస్మాన్ ఘనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు..

ఆఫ్ఘాన్ తరుపున 17 వన్డేలు, 35 టీ20 మ్యాచులు ఆడిన ఉస్మాన్ ఘనీ, 2022లో నెదర్లాండ్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడాడు. 17 వన్డేల్లో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 435 పరుగులు చేసిన ఉస్మాన్ ఘనీ, 33 టీ20 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 764 పరుగులు చేశాడు. 

26 ఏళ్ల ఉస్మాన్ ఘనీ, ట్విట్టర్ ద్వారా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డులో అవినీతిపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ఎంతో జాగ్రత్తగా ఎన్నో విషయాలను పరిశీలించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ బోర్డులో నిండిపోయిన అవినీతి, నన్ను ఈ నిర్ణయం తీసుకోవడానికి పురిగొలిపింది.. క్రికెట్ మాత్రం మానేయను. సరైన మేనేజ్‌మెంట్, న్యాయబద్ధమైన సెలక్షన్ కమిటీ వచ్చే వరకూ ఎదురుచూస్తూ క్రికెట్‌లో కష్టపడుతూనే ఉంటాను..

Scroll to load tweet…

ఒక్కసారి ఇది జరిగితే సగర్వంగా ఆఫ్ఘాన్ తరుపున ఆడేందుకు తిరిగి వస్తాను. అప్పటిదాకా నా ప్రియమైన దేశం తరుపున ఆడకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్‌ని కలవలేకపోయా. అతను నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు..

నన్ను ఎందుకు జట్టు నుంచి తొలగించారనేదానికి చీఫ్ సెలక్టర్ దగ్గర సరైన సమాధానం లేదు. కారణం లేకుండా టీమ్ నుంచి ఎందుకు తొలగిస్తారు? ఆ కారణం ఏదో చెప్పలేకపోతే అవినీతి జరిగినట్టేగా...’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు ఉస్మాన్ ఘనీ..