అప్ఘానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్... అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు విశేష సేవలు అందిస్తున్న అతడికి ఆ దేశ క్రికెట్ బోర్డు మంచి అవకాశాన్నిచ్చింది. ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత అప్ఘాన్ టీం కెప్టెన్సీ బాధ్యతలను రషీద్ ఖాన్ అందుకున్నాడు. 

పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్లతో పాటు టెస్ట్ ఫార్మాట్ లో కూడా రషీద్ ఖానే కెప్టెన్. ఇలా అత్యంత చిన్న వయసులోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అతడు ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.  అంతర్జాతీయ టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత చిన్న వయసులో(20 ఏళ్ల 350 రోజులు) కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డును రషీద్ సొంతం చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా రషీద్ అప్ఘాన్ టీం కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.

గతంలో ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ తతేందు తైబు(20ఏళ్ల 358 రోజులు) వుండేది. కానీ తాజాగా కేవలం 8 రోజుల తేడాతో రషీద్ ఖాన్ ఈ రికార్డును బద్దలుగొట్టాడు. దీంతో తైబు రెండో స్థానానికి పడిపోయాడు. భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు 21ఏళ్ల 77 రోజుల వయసులోనే భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను చేపట్టాడు.  

 అతి చిన్న వయసులో అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట వుంది. అతడు 1996 లో కోలంబో వేదికన శ్రీలంక పై మొదటిసారి కెప్టెన్ గా వ్యవహరించారు. ఆ  సమయంలో అతడి వయసు కేవలం 23 ఏళ్ల 126 రోజులు మాత్రమే. 

ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో జట్టును ముందుండి నడపడంలో విఫలమైన గుల్బదిన్ నయిబ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. ఈ ప్రపంచ కప్ కు ముందే అతడికి  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి కేవలం ఈ టోర్నీలో మాత్రమే కొనసాగించారు. తర్వాత ఆ జట్టు సారథ్య బాధ్యతలను కీలక ఆటగాడు, ప్రపంచ స్థాయి స్పిన్నర్ రషీద్ ఖాన్ కు అప్పగించారు. అలాగే ప్రపంచ కప్ టోర్నీకి ముందు వరకు కెప్టెన్ గా వ్యవహరించిన అస్ఘాన్ అప్ఘాన్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.

సంబంధిత వార్తలు

అప్ఘానిస్థాన్ సారథిగా రషీద్... అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు