ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో మొదటి సారి పాల్గొన్న అప్ఘానిస్తాన్ జట్టు కనీసం ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో ఈ జట్టు అదరగొట్టడంతో మెయిన్ టోర్నీలో కూడా అప్ఘాన్ సంచలనాలు సృష్టించగలదని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ లేకుండానే ఆ జట్టు వరుస ఓటములతో పాయింట్స్ పట్టికలో చివరి స్థానానికే పరిమితమయ్యింది. ఇలా నిరాశపర్చిన అప్ఘాన్ జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు అప్ఘాన్ క్రికెట్  బోర్డు సిద్దమయ్యింది. అయితే ఆ పని కెప్టెన్సీతోనే ప్రారంభించింది. 

ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో జట్టును ముందుండి నడపడంలో విఫలమైన గుల్బదిన్ నయిబ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. ఈ ప్రపంచ కప్ కు ముందే అతడికి  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన జట్టు కేవలం ఈ టోర్నీలో మాత్రమే కొనసాగించారు. తాజాగా ఆ జట్టు సారథ్య బాధ్యతలను కీలక ఆటగాడు, ప్రపంచ స్థాయి స్పిన్నర్ రషీద్ ఖాన్ కు అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రపంచ కప్ టోర్నీకి ముందు వరకు కెప్టెన్ గా వ్యవహరించిన అస్ఘాన్ అప్ఘాన్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.

ఇలా జట్టు పగ్గాలు చేపట్టిన రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. అతి చిన్న వయసులోనే ఓ అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ ఎంపికైన ఘనత అతడికే దక్కింది. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ రజిన్ సాలే పేరిట వుండేది. అతడు ఇరవయ్యేళ్ల 297 రోజుల వయసులు కెప్టెన్ గా వ్యవహరించగా రషీద్ ఖాన్ కేవలం 19ఏళ్ల 165 రోజుల వయసులోనే ఈ ఘనత  సాధించాడు. 

అలాగే అతిచిన్న వయసులో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినఘనత కూడా రషీద్  కే దక్కింది. అంతకుముందు జింబాబ్వే కెప్టెన్ తతేందు తైబు పేరిట ఈ రికార్డు వుండేది. కేవలం 20ఏళ్ల 358 రోజుల వయసులోనే కెప్టెన్ గా వ్యవహరించారు. హరారే లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. 

ఇక భారత్ విషయానికి వస్తే అతి చిన్న వయసులో కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత మాస్టర్ బ్లాస్టర్ పేరిట  వుంది. అతడు 1996 లో కోలంబో వేదికన శ్రీలంక పై మొదటిసారి కెప్టెన్ గా వ్యవహరించారు. ఆ  సమయంలో అతడి వయసు కేవలం 23 ఏళ్ల 126 రోజులు మాత్రమే.