ఆఫ్ఘన్ క్రికెటర్ పెద్ద మనసు.. అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై వున్న వారికి దీపావళి సాయం, ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడంటే
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అహ్మదాబాద్ నగర వీధుల్లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తోన్న బిచ్చగాళ్లకు దీపావళి పర్వదినాన్ని జరుపకునేందుకు గాను డబ్బులు పంచిపెట్టాడు.
ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఈ వన్డే ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జట్టు .. తమ పసికూనలం కాదని నిరూపించింది. ఏకంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి జట్లను ఓడించినంత పనిచేయగా.. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. కాస్తలో మిస్ అయ్యింది కానీ.. లేదంటే ఆఫ్ఘన్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టేది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఆ జట్టు 6వ స్థానంలో నిలిచింది. తమ ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆఫ్ఘన్ క్రికెటర్లు.. మైదానం బయట తమ మంచి మనుసుతోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
తాజాగా ఆ దేశ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అహ్మదాబాద్ నగర వీధుల్లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తోన్న బిచ్చగాళ్లకు దీపావళి పర్వదినాన్ని జరుపకునేందుకు గాను డబ్బులు పంచిపెట్టాడు. వీధుల్లో నిద్రిస్తోన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లిన గుర్బాజ్.. అంతే వేగంగా తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రిపూట వీధిలో నిద్రిస్తున్న ఒక్కొక్కరికీ రూ.500 నోట్లు ఇచ్చాడు.
అంతేకాదు.. తను చేసిన సహాయం గురించి ఎలాంటి ప్రచారమూ చేసుకోలేదు. కానీ అక్కడే వున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్బాజ్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆయనను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అన్నట్లు ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 13 వేల మందికి పైగా వీక్షించారు.