Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ దూకుడుకు అబ్రర్ అడ్డుకట్ట.. అరంగేట్ర మ్యాచ్ లోనే అదుర్స్

PAKvsENG 2022: పాకిస్తాన్ - ఇంగ్లాండ్ నడుమ  ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు తడబడుతున్నది. పాక్ యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ఐదు వికెట్లతో చెలరేగుతున్నాడు.

Abrar Ahmed Fifer Troubles England, lost 5 Wickets in First Innings
Author
First Published Dec 9, 2022, 2:07 PM IST

రావల్పిండిలో ముగిసిన తొలి టెస్టులో  పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో తడబడుతున్నది.  ముల్తాన్ వేదికగా  జరుగుతున్న రెండోటెస్టులో ఆ జట్టు   తొలి ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికే ఐదు కీలక వికెట్లను కోల్పోయింది.  కొత్త కుర్రాడు అబ్రర్ అహ్మద్ స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు.   తొలి టెస్టులో మాదిరిగా దూకుడుగానే ఆడుతున్నా   వికెట్లను కోల్పోతున్నది. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 33 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ ఐదు వికెట్లూ అబ్రర్ కే దక్కడం విశేషం. అబ్రర్ కు ఇదే తొలి టెస్టు. 

ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు గత మ్యాచ్ లో మాదిరిగా శుభారంభం దక్కలేదు.  ఓపెనర్లు దూకుడుగా ఆడటానికి యత్నించారు.  రావల్పిండి మాదిరిగానే ముల్తాన్ కూడా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్.  దీంతో ఇక్కడ కూడా  భారీ బాదుడు తప్పదనుకున్నారు. 

కానీ  బ్యాటింగ్ తో పాటు స్పిన్ కూ అనుకూలించే పిచ్ పై  అబ్రర్  ఇంగ్లీష్ బ్యాటర్ల పప్పులుడకనీయలేదు. పిచ్ సంగతి తెలిసిన బాబర్.. అబ్రర్ ను త్వరగానే బౌలింగ్ ఇచ్చాడు. నసీమ్ షా, హరీస్ రౌఫ్ లేకపోవడంతో  పాకిస్తాన్ కు అడే దిక్కయ్యాడు. కెప్టెన్ నమ్మకాన్ని  అబ్రర్ వమ్ము చేయలేదు. తొలుత  జాక్ క్రాలే (19) ను ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 8.5 ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేసిన అబ్రర్.. తర్వాత 18 ఓవర్ చివరిబంతికి  బెన్ డకెట్ (63) ను పెవిలియన్ కు పంపాడు. 

 

ఆ  తర్వాత కొద్దిసేపటికే జో రూట్ (8) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపగా.. ధాటిగా ఆడుతున్న ఓలీ పోప్ (60) ను కూడా  బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన  హ్యారీ బ్రూక్ (9) కూడా  ఎక్కువసేపు నిలులేవు.  ఈ ఐదుగురిలో  జో రూట్ తప్ప మిగిలినవారంతా  రావల్పిండి టెస్టులో తొలి రోజే సెంచరీలు చేసిన వీరులే కావడం గమనార్హం.  

ప్రస్తుతం  ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ (14 బ్యాటింగ్), విల్ జాక్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.   పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ అలీ, జహీద్ మహ్మద్, మహ్మద్ నవాజ్ లు ఏ ప్రభావం చూపకున్నా అబ్రర్ మాత్రం  అదరగొడుతున్నాడు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios