Asianet News TeluguAsianet News Telugu

బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న పాక్..! తొలిరోజు బాబర్ సేనదే ఆధిపత్యం

PAKvsENG 2nd Test: మొదటి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన పాకిస్తాన్.. రెండో టెస్టులో అరంగేట్ర కుర్రాడు అబ్రర్ అహ్మద్ స్పిన్ మాయాజాలంతో  తొలిరోజు ఆదిపత్యం చెలాయించింది.  
 

Abrar Ahmed and Babar Azam Stars as Pakistan Dominates 1st Day in Multan Test
Author
First Published Dec 9, 2022, 5:55 PM IST

రావల్పిండిలో  విజయం ముంగిట బొక్క బోర్లా పడ్డ పాకిస్తాన్ క్రికెట్ జట్టు రెండో టెస్టులో మాత్రం ఇంగ్లాండ్ కు ధీటుగా బదులిస్తున్నది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన పాకిస్తాన్.. రెండో టెస్టులో అబ్రర్ అహ్మద్ స్పిన్ మాయాజాలంతో  తొలిరోజు ఆదిపత్యం చెలాయించింది.   ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  ఇంగ్లాండ్ ను 281 పరుగులకే  పరిమితం చేసిన ఆ జట్టు.. మొదటి రోజు ఆట ముగిసేసమయానికి  28 ఓవర్లకు 107  రన్స్ చేసింది. పాక్ సారథి బాబర్ ఆజమ్ (76 బంతులలో 61, 9 ఫోర్లు, 1 సిక్స్), సౌద్ షకీల్ (46 బంతుల్లో 32, 5 ఫోర్లు)   క్రీజులో ఉన్నారు.  

ముల్తాన్ వేదికగా  జరుగుతున్న  రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్‌.. అరంగేట్ర స్పిన్నర్ అబ్రర్ అహ్మద్  స్పిన్ మాయాజాలానికి  కుదేలైంది.   ఇంగ్లాండ్ ఇన్నింగ్స్.. 8.5 వ ఓవర్లోనే ఆ జట్టుకు తొలి షాక్ తాకింది.  ఓపెనర్ జాక్ క్రాలే.. 19 పరుగులు చేసి అబ్రర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాత  బెన్ డకెట్ (49 బంతుల్లో 63, 9 ఫోర్లు, 1 సిక్స్), ఒలీ పోప్ (61 బంతుల్లో 60, 5 ఫోర్లు) లు కలిసి రెండో వికెట్ కు 79 పరుగులు జోడించారు.  దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్ ను అబ్రర్.. 18.6వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. తర్వాత   జో రూట్ (8), పోప్ లనూ పెవిలియన్ కు పంపాడు. ఇదే ఊపులో హ్యారీ బ్రూక్ ను కూడా ఔట్ చేశాడు. లంచ్ వరకు ఇంగ్లాండ్ 33 ఓవర్లలో5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

లంచ్ తర్వాత.. 

లంచ్ తర్వాత  ఇంగ్లాండ్ కు అబ్రర్ కోలుకోలేని షాకులిచ్చాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (30), విల్ జాక్స్ (31) లను ఔట్ చేశాడు. ఆ తర్వాత  ముగ్గురు బ్యాటర్లు రాబిన్సన్ (5), జాక్ లీచ్ (0), జేమ్స్ అండర్సన్ (7) లను జహీద్ మహ్మద్  పెవిలియన్ కు పంపాడు.  మార్క్ వుడ్ (36 నాటౌట్) ఆదుకోవడానికి యత్నించినా  ఇంగ్లాండ్ బ్యాటర్లు సహకరించకపోవడంతో ఇంగ్లాండ్ 54.1 ఓవర్లలో 281 పరుగులకే పరిమితమైంది.  

 

ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన పాకిస్తాన్.. రెండో ఓవర్లోనే షాక్ తాకింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (0) ను అండర్సన్ ఔట్ చేశాడు.  మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (14)  ను జాక్ లీచ్ పెవిలియన్ కు పంపాడు.  కానీ బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ మూడో వికెట్ కు 56 పరుగులు జోడించారు.   ప్రస్తుతం పాకిస్తాన్.. 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్.. 174 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు  పాకిస్తాన్ గనక ఇదే రీతిలో  ఆడగలిగితే  ఈ టెస్టులో  గెలుపునకు బాటలు వేసుకోవచ్చు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios