ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడని అనడం మనం వింటుంటాం. ఒంటరిపోరాటంతో ఒక్కడే జట్టును గెలిపించిన సందర్భాల్లో అటగాడిని పొగుడుతూ ఈ పదాన్ని వాడతారు. అయితే నిజంగానే ఒక్క చేయితో ఆడటం చాలా కష్టం. క్రికెట్లో అయితే ఒంటిచేత్తో బ్యాటింగ్ చేయడం కాదు కదా బ్యాట్ ను పట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది రాకెట్ వేగంగా శరీరంపైకి  దూసుకొస్తున్న బంతిని ఆడ్డుకోవాలంటేనే సాధ్యం కాదు. అలాంటిది దాన్ని  బౌండరీకి...కాదుకాదు మైదానం  బయటకు పంపడమంటే మామూలు విషయం కాదు.  ఇలా అసాధ్యమైన బౌండరీని సుసాధ్యం చేసి నిజంగానే తాను మిస్టర్ 360° అని రుజువుచేశాడు ఆర్సిబి హిట్టర్ ఎబి డివిలియర్స్. 

బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లోనే 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 82 పరుగులు సాధించి ఆర్సిబికి  భారీ స్కోరును అందించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లరో అతడి దూకుడుకు పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 

ముఖ్యంగా షమీ వేసిన 19వ ఓవర్లో అతడు ఒంటి చేత్తో బంతిని మైదానం బయటకు పంపించిన తీరు ఈ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. డివిలియర్స్ తన శరీరంపైకి వస్తున్న ఫల్ టాస్ బంతి నుండి చాకచక్యంగా తప్పించుకుని దాన్ని  అంతే వేగంతో బౌండరీకి తరలించాడు. తన ఎడమ చేతితో మాత్రమే బంతిని బాదగా అదికాస్తా అమాంతం మైదానం బయట పడింది. ఇలా డివిలియర్స్ నలువైపులా 7 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. 

ఇలా షమీ వేసిన 19 ఓవర్లో 3 సిక్సర్ల సాయంతో డివిలియర్స్ మొత్తం 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో స్టోయినీస్ రెచ్చిపోవడంతో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఇలా చివరి రెండు ఓవర్లలోనే 48 పరుగులు బెంగళూరు ఖాతాలో చేరడంతో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించడంలో పంజాబ్ విఫలమవడంతో ఆర్సిబి 17 పరుగుల తేడాతో హ్యాట్రికి విజయాన్ని నమోదు చేసుకుంది.