మిస్టర్‌ 360, సూపర్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున తళుక్కుమననున్నాడు!. 2019 వరల్డ్‌కప్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్‌ ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నాడు. 

వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక సమయంలో ఆడేందుకు ఆసక్తి చూపాడు. కానీ సెలక్టర్లు డివిలియర్స్‌ నిర్ణయాన్ని గౌరవించినా, జట్టులో చోటు ఇవ్వడానికి నిరాకరించారు. ఇటీవలి 3టీసీఎం మ్యాచ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టుకు డివిలియర్స్‌ సారథ్యం వహించాడు. 

దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో డివిలియర్స్‌ ఆడతాడా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే ప్రశ్నను దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ను అడుగగా ఆసక్తికరంగా  బదులిచ్చాడు. 

'ఏబీ డివిలియర్స్‌ కచ్చితంగా రేసులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్‌ ఉండటాన్ని ఎంతగానో ఇష్టపడతాను. జట్టులో డివిలియర్స్‌ ఉండేందుకు ఏ జట్టు అయినా ఇష్టపడుతుందని నా భావన. డివిలియర్స్‌ను ఆ దిశగా తీసుకెళ్లటంతో పాటు టీ20 వరల్డ్‌కప్‌ ఎప్పుడు జరుగుతుందో ఆసక్తిగా చూడాలి' అని డికాక్‌ అన్నాడు. 

ఏబీ డివిలియర్స్‌ సైతం టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇకపోతే.... ఇన్నాండ్లూ ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూసిన బీసీసీఐ,టి20 ప్రపంచ కప్ వాయిదాతో.... ఐపీఎల్‌ నిర్వహణలో వేగం పెంచనుంది. కోవిడ్‌-19 మహమ్మారితో ఐపీఎల్‌ 2020 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు అనంతరం నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ అధికారికంగా వాయిదా వేయటంతో ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ప్రోటోకాల్‌ స్వేచ్ఛ లభించింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదిక, లాజిస్టికల్‌ సహా ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రానున్న పది రోజుల్లో సమావేశం కానుంది. 

ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. ' ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మరో వారం పది రోజుల్లో సమావేశం కానుంది. తుది షెడ్యూల్‌ సహా ఇతర అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పటివరకైనా 60 మ్యాచులతో పూర్తి స్థాయి ఐపీఎల్‌ అనుకుంటున్నాం. వేదిక యుఏఈ కావచ్చు. వేదిక కేవలం నిర్వహణ సౌలభ్యం కోసమే. ఎక్కడ జరిగినా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే ఆడనున్నారు' అని పటేల్‌ తెలిపాడు