ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు.. మొత్తంగా 48 పరుగులతో సంచలనం.. (వీడియో)
క్రికెట్‌లో కొన్ని సార్లు ఎవరూ ఊహించని క్రేజీ ఘటనలు చోటుచేసుకుంటాయనే సంగతి తెలిసిందే.
క్రికెట్‌లో కొన్ని సార్లు ఎవరూ ఊహించని క్రేజీ ఘటనలు చోటుచేసుకుంటాయనే సంగతి తెలిసిందే. గతేడాది విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్‌తో.. ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. తాజాగా ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్ కూడా తనదైన శైలిలో బ్యాట్‌తో విజృంభించి ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. కాబూల్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో అమీర్ జజాయ్ బౌలింగ్‌లో సెడిఖుల్లా అటల్ ఈ విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆ ఓవర్‌లో నో-బాల్‌ను కూడా సిక్సర్‌గా మలచడంతో ఇది సాధ్యమైంది.
మొత్తంగా ఆ ఓవర్‌లో సెడిఖుల్లా అటల్ జట్టకు 48 పరుగులు లభించాయి. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఒక ఓవర్‌లో ఏకంగా 48 పరుగులొచ్చిన బౌలర్‌గా అమీర్ జజాయ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
వివరాలు.. కాబూల్ ప్రీమియర్ లీగ్ షాహీన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ జట్టులు తలపడ్డాయి. షాహీన్ హంటర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేంది. అయితే షాహీన్ హంటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. అమీర్ జజాయ్ వేసిన ఆ ఓవర్‌లో ఒక్క లీగల్ బాల్ పడకముందే 12 పరుగులు వచ్చాయి. నో బాల్‌గా వేసిన మొదటి బంతిని అటల్ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత వేసిన బాల్.. వైడ్‌గా పడి బౌండరీ చేరుకోవడంతో ఐదు పరుగులు లభించాయి. తర్వాత అటల్ ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తంగా 48 పరుగులు లభించారు. ఈ మ్యాచ్‌లో అటల్ 56 బంతుల్లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటల్ ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒక టీ20 ఆడాడు. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది.