Asianet News TeluguAsianet News Telugu

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ జోగిందర్ శర్మ... ఆఖరి మ్యాచ్ ఆడిన 16 ఏళ్లకు...

2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జోగిందర్ శర్మ... పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్.. 

2007 T20I World Cup hero Joginder Sharma announces his retirement after 16 years cra
Author
First Published Feb 3, 2023, 12:42 PM IST

జోగిందర్ శర్మ... ఈ పేరు చెప్పగానే 2007 టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన బౌలర్ గుర్తుకు వస్తాడు. టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్, ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం కొసమెరుపు...

దేశవాళీ టోర్నీల్లో హర్యానా రాష్ట్రానికి కెప్టెన్సీ చేసిన ఆల్‌రౌండర్ జోగిందర్ శర్మ, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరుపున 4 వన్డేలు ఆడిన జోగిందర్ శర్మ ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. 

అయితే టీ20ల్లో జోగిందర్ శర్మకు అవకాశం కల్పించారు సెలక్టర్లు.  ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన జోగిందర్ శర్మ, చివరి ఓవర్‌లో 15 పరుగులు సమర్పించాడు. అయితే ఆసీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాల్సి ఉండగా 15 పరుగులే రావడంతో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరింది..

ఇదే నమ్మకంతో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసే బాధ్యత కూడా జోగిందర్ శర్మకే అప్పగించాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క వికెట్..

మొదటి బంతి వైడ్‌గా వెళ్లగా ఆ తర్వాత బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతి ఫుల్ టాస్‌ వేయడంతో పాక్ బ్యాటర్ మిస్బా వుల్ హక్, స్ట్రైయిక్ సిక్సర్ బాదేశాడు.దీంతో పాక్ విజయానికి ఆఖరి నాలుగు బంతుల్లో 6 పరుగులు కావాలి. ఈ దశలో జోగిందర్ వేసిన బంతికి స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు మిస్బా వుల్ హక్...

బంతి గాల్లోకి లేచి ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ చేతుల్లో వాలింది. దీంతో టీమిండియా 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని, మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత జోగిందర్ శర్మకు రూ.21 లక్షల రికార్డుతో పాటు డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్ పోలీసుగా ఉద్యోగాన్ని ఆఫ్ చేసింది.

2007 అక్టోబర్‌లోనే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జోగిందర్ శర్మ, 2016-17 సీజన్ వరకూ రంజీ మ్యాచుల్లో ఆడాడు. 2012 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన జోగిందర్ శర్మ, సీఎస్‌కేకి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. 2013 వేలంలో అమ్ముడుపోని జోగిందర్ శర్మ, ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా ఆడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు...

2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జోగిందర్ శర్మ, 2023లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. జోగిందర్ శర్మ రిటైర్మెంట్‌తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు. వీరిలో దినేశ్ కార్తీక్, 2022 టీ20 వరల్డ్ కప్‌ ఆడగా రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios