Pakistan Vs Australia: కరాచీ వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దక్కింది. పాక్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసినా ఆ జట్టు మాత్రం ఫాలో ఆన్ ఆడించలేదు. ఎందుకు..?
సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది ఆస్ట్రేలియా. రెండూ అగ్రశ్రేణి జట్లే. దీంతో ఇరుజట్ల మధ్య భీకరపోరు తప్పదనుకున్నారు అభిమానులు. అయితే పాక్ తయారుచేస్తున్న నిర్జీవ పిచ్ ల పుణ్యమా అని రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఆ మజా దక్కలేదు. ఇక రెండో టెస్టు కూడా దాదాపు అదే విధంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు (556-9 డిక్లేర్డ్) చేసిన ఆసీస్.. అనంతరం పాకిస్థాన్ ను తక్కువ స్కోరు (148 ఆలౌట్) కే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు ఏకంగా 408 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కెప్టెన్ అయినా ప్రత్యర్థి జట్టును మరోసారి బ్యాటింగ్ కు ఆహ్వానిస్తాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి టెస్టును సొంతం చేసుకోవాలని భావిస్తాడు. కానీ ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మాత్రం అలా చేయలేదు. ఎందుకు..?
తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా పాక్ ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ కు భయం పట్టుకుందా..? 21 ఏండ్ల క్రితం ఆ జట్టు చేసిన చారిత్రక తప్పిదం.. ఇంకా కంగారూలను వెంటాడుతుందా..? అంటే అవుననే అంటున్నారు నెటిజనులు. పాక్ ను ఫాలో ఆన్ ఆడివ్వకుండా ఉండటానికి కూడా ఈడెన్ గార్డెన్ టెస్టే కారణమని కొత్త భాష్యాలు చెబుతున్నారు. అదేంటో మీరూ చదవండి మరి..
జైత్రయాత్రకు బ్రేకులు పడ్డ క్షణమది..
అది 2001. కెప్టెన్ స్టీవ్ వా సారథ్యంలో ఆసీస్ జట్టు వరుసగా 15 టెస్టు విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రోజులవి. ఈ క్రమంలో భారత పర్యటనకు వచ్చారు కంగారూలు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా వాంఖడే లో జరిగిన తొలి టెస్టులో భారత్ ను ఓడించారు. రెండో టెస్టు కోల్కతా లో.. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగుల భారీ స్కోరు. బదులుగా భారత్ 171 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ కు 274 పరుగుల ఆధిక్యం. ఈ సమయంలో భారత్ ను ఫాలో ఆన్ ఆడించాడు స్టీవ్ వా..
రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. పట్టుదలగా ఆడింది. ఓపెనర్లు పెద్దగా రాణించలేదు. అప్పుడొచ్చాడు హైదరాబాద్ సొగసరి వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి ఆసీస్ బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు ఏకంగా 376 పరుగులు జోడించారు. ఈ క్రమంలో లక్ష్మణ్.. భారత్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు (281.. కొద్దికాలం తర్వాత సెహ్వాగ్, కరుణ్ నాయర్ దీనిని అధిగమించారు) చేయగా ద్రావిడ్ 180 రన్స్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్ల నష్టానికి 657 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు టర్బోనేటర్ హర్భజన్ సింగ్. రెండో ఇన్నింగ్స్ లో హ్యాట్రిక్ తో పాటు మొత్తంగా 6 (కోల్కతా టెస్టు లో మొత్తం 13 వికెట్లు) వికెట్లు పడగొట్టి ఆసీస్ నడ్డివిరిచాడు. తొలి టెస్టులో ఓటమితో వెనుకబడ్డ భారత్ తర్వాత పుంజుకుని సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.
సరిగ్గా అదే రోజు..
2001 మార్చి 11-15. ఈడెన్ గార్డెన్ టెస్టు జరిగిన తేదీ అది. ఆ టెస్టు ముగిసి నేటికి 21 ఏండ్లు కావస్తున్నది. అయినా ఫాలో ఆన్ ఇవ్వడానికి ఇప్పటికీ ఆసీస్ భయపడుతున్నది. కరాచీ టెస్టులో 408 పరుగుల భారీ ఆధిక్యాన్ని పెట్టుకుని కూడా పాట్ కమిన్స్.. పాక్ ను ఫాలో ఆన్ ఆడించకపోవడానికి ఇదే కారణమని ట్విట్టర్ లో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ఆస్ట్రేలియా జట్టు అసమర్థతను చూసి పలువురు చురకలంటిస్తున్నారు. మరికొంతమందేమో.. 21 ఏండ్లు గడిచినా ఇప్పటికీ ఆసీస్.. భారీ ఆధిక్యాలున్న సమయాల్లో ఫాలో ఆన్ ఆడించడం లేదంటే అది లక్ష్మణ్ - ద్రావిడ్ లు చేసిన గాయాన్ని ఇంకా మరిచిపోవడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణధ్యాయంగా లిఖించదగిన ఆ టెస్టును ఇప్పటికీ తలుచుకుంటుండటం నిజంగా గొప్ప విషయం.
ఇక కరాచీ లో జరుగుతున్న పాక్-ఆసీస్ రెండో టెస్టు మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 556-9 పరుగులు చేసిన ఆసీస్.. పాక్ ను 148 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చి మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా (35 నాటౌట్), లబూషేన్ (37 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 489 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.
