క్రికెట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేస్తే ఎవరైనా ప్రశంసిస్తారు. కానీ వేటు వేయడం గురించి ఎక్కడైనా విన్నారా. కానీ ఇది నిజం. ద్విశతకం బాది జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించిన ఓ క్రికెటర్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసింది.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ కౌంటీ జట్టు కెంట్‌ తరపున ఆడుతున్న జోర్డన్ కాక్స్ అనే క్రికెటర్‌ బాబ్ విల్లీస్ ట్రోఫీ మ్యాచ్‌లో ససెక్స్ టీమ్‌పై 238 పరుగులు చేశాడు. అతని దూకుడుతో మ్యాచ్ వన్ సైడయ్యింది.

అయితే స్టేడియంలో ఓ అభిమానితో సెల్ఫీ దిగాడం అతనికి చేటు తెచ్చింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడనే అభియోగంపై కాక్స్‌పై వేటు వేశారు. దీంతో అతను మిడిల్ సెక్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు.

బయో సెక్యూర్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను కాక్స్ ఉల్లంఘించాడని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే కోవిడ్ 19 పరీక్షలో నెగిటివ్ వస్తేనే, తిరిగి జోర్డన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.

జరిగిన ఘటన పట్ల కాక్స్ క్షమాపణలు చెప్పాడు. జోర్డన్ మంచి క్రికెటరేనని అతను ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని, అతను ఖచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సిందే అని జట్టు డైరెక్టర్ పౌల్ డౌన్‌టౌన్ తెలిపారు.