ఇంగ్లాండ్ వేదికన జరిగిన యాషెస్ సీరిస్ లో ఆతిథ్య, పర్యాటక జట్లు రెండూ సమఉజ్జీలుగా నిలిచాయి. ప్రతి విభాగంలోనూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఒకేతరహా ఆటతీరును కనబర్చి చివరకు విజయాలను కూడా సమానంగానే అందుకున్నాయి. ఐదు టెస్టుల సీరిస్ లో ఇరు జట్లు రెండేసి విజయాలను అందుకోగా ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇలా ఆద్యంతం అద్భుతంగా సాగిన ఈ యాషెస్ సీరిస్ లో దాదాపు వందేళ్లకు పైబడిన ఓ రికార్డు బద్దలయ్యింది. ఇరు జట్లు కలిసి ఓ చెత్త రికార్డును సమిష్టిగా తమ ఖాతాలో వేసుకున్నాయి.  

తాజాగా ముగిసిన ఈ సీరిస్ లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు తీవ్రంగా నిరాశపర్చారు. ఆసిస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, హర్రిస్ లతో పాటు ఇంగ్లాండ్ ఓపెనర్లు బర్న్స్, డెన్లీ లు తమ జట్లకు ఏ ఒక్క మ్యాచ్ లోనూ శుభారంభాన్ని అందివ్వలేకపోయారు. ఇలా ఈ ఐదు టెస్టుల సీరిస్ లో ఓపెనర్లు నలుగురు కలిసి కేవలం 12.55 సగటుతో మాత్రమే పరుగులు సాధించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు ఇంత  తక్కువ సగటుతో పరుగులు సాధించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ యాషెస్ ఓపెనింగ్ జోడీల పేరిట చెత్త  రికార్డునమొదయ్యింది. 

1906 సంవత్సరంలో  అంటే 113 ఏళ్ళ కిందట దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరిస్ జరిగింది. ఇందులో కూడా ఇరుజట్ల ఓపెనర్లు సాధించిన పరుగుల సగట 14.16 గా వుంది. ఇప్పటివరకు ఇదే అత్యంత చెత్త రికార్డు. ఇది ఈ యాషెస్ సీరిస్ ద్వారా బద్దలయ్యింది. 

ఈ యాషెస్ సీరిస్ లో భాగంగా జరిగిన చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. చివరిరోజైన ఆదివారం 399 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ 263 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో  135 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ 2-2 తో సీరిస్ ను సమం చేసింది.