Asianet News TeluguAsianet News Telugu

చమురు ఉత్పత్తి తగ్గింపునకు ఒకే: ఆ వెంటనే పెరిగిన ధరలు?

ఒపెక్ ప్లస్ దేశాలు రోజూ పది లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడంతో చమురు ధరలు 11 శాతం పెరిగాయి. కొవిడ్-19 వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు డిమాండ్ పడిపోయిన సంగతి తెలిసిందే.

Oil prices rise as Opec+ combine reaches a production cut deal
Author
Hyderabad, First Published Apr 11, 2020, 11:26 AM IST

న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ల బ్యారెళ్ల తగ్గించాలని ఒపెక్ ప్లస్ (ఒపెక్, రష్యా) దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ముడి చమురు ధరలు ఒక్కసారిగా 11 శాతం పెరిగాయి.  కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ప్రపంచ దేశాల్లో ముడి చమురు డిమాండ్ 2002 నాటి కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  

మెక్సికో మినహా ప్రధాన చమురు ఎగుమతి దేశాలన్నీ వచ్చే రెండు నెలల్లో రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో గురువారం బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ ధర 32.02 డాలర్ల వద్దకు చేరుకున్నది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగి 23.56 డాలర్ల వద్ద ట్రేడయింది. 

ఇదిలా ఉంటే, గురువారం మొదలైన సుదీర్ఘంగా సాగిన ఒపెక్ ప్లస్ (ఒపెక్ ప్లస్ రష్యా) సహా ఇతర దేశాల వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం వేకువజామున ముగిసింది. మెక్సికో అంగీకరిస్తే జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి రోజూ ఎనిమిది మిలియన్ల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించారు. 

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో పలు దేశాలు లాక్ డౌన్‌తో స్వీయ దిగ్బంధం విధించుకున్న నేపథ్యంలో చమురు వినియోగం తగ్గింది. దీనికి తోడు సౌదీ అరేబియా- రష్యా మధ్య ధరల యుద్ధం నేపథ్యంలో ఇటీవల చమురు ధరలు రెందు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రోజువారీగా ఉత్పత్తిని తగ్గించి ధరలకు మద్దతు కల్పించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వచ్చే జూన్ 10వ తేదీన మరోసారి సమావేశమై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి. 

also read న్యూ ట్విస్ట్: ఆ దేశాలను ఆదుకునేందుకే వాటిని ఎగుమతి... కేంద్రం కొత్త రూల్

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురుకు డిమాండ్ బాగా పతనమైంది. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించడానికి ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియా తొలుత నిర్ణయానికి వచ్చింది. కానీ రష్యా దీనికి మోకాలడ్డింది. ఆ రెండు దేశాల మధ్య ధరల యుద్ధం మొదలైంది. 

దీనికితోడు ధరల పతనం వల్ల ఏర్పడిన ఆదాయం లోటును పూడ్చుకోవడానికి పోటీ పడి మరీ ఉత్పత్తిని పెంచాయి. ఫలితంగా భారీ స్థాయిలో ధరలు పడిపోయాయి. చమురు ధరలు భారీగా పతనం కావడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. 

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదించారు. ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని ప్రతిపాదించారు. మరోవైపు రష్యాపైనా ఒత్తిడి పెంచారు. ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన వెంటనే మహ్మద్ బిన్ సల్మాన్ వెంటనే ఒపెక్ సమావేశ తేదీని ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం గురువారానికి వాయిదా పడింది. 

ఒపెక్ ప్లస్ సమావేశం జరుగడానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా, ఒపెక్ కూటమి మధ్య చమురు ఉత్పత్తి తగ్గించడం కోసం ఒప్పందం కుదరనున్నదని పేర్కొనడం గమనార్హం. ఎట్టకేలకు ట్రంప్ ప్రకటించినట్లే శుక్రవారం ఒపెక్, రష్యా మధ్య ఒప్పందం ఖరారు కావడంతో చమురు ధరలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios