Asianet News TeluguAsianet News Telugu

న్యూ ట్విస్ట్: ఆ దేశాలను ఆదుకునేందుకే వాటి ఎగుమతి... కేంద్రం కొత్త రూల్

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. విదేశీ ప్రభుత్వాలకు మాత్రమే ఈ ఔషధం అందిస్తామని, ప్రైవేటు సంస్థలకు కాదని తేల్చిచెప్పింది.
 

Govt to Export Surplus Hydroxychloroquine, Says India Has Buffer Stock of Medicine to Fight COVID-19
Author
Hyderabad, First Published Apr 11, 2020, 11:05 AM IST

న్యూఢిల్లీ: కొవిడ్​-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని విదేశీ ప్రభుత్వాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రైవేట్ సంస్థలకు మాత్రం అందించడంలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఔషధం ఇంకా నిషేధిత ఎగుమతుల విభాగంలో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ప్రైవేట్ సంస్థల మధ్య ఎగుమతులు నిషేధం
"హైడ్రాక్సీక్లోరోక్విన్ నిషేధిత వస్తువుల జాబితాలోనే కొనసాగుతోంది. ప్రైవేట్​-ప్రైవేట్​ కంపెనీ లేదా దేశీయ ఎగుమతిదారుల నుంచి విదేశీ దిగుమతిదారులు మధ్య ఈ ఔషధ వాణిజ్యం నిషేధం’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ దేశాలకు సాయ పడేందుకే..
‘ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు సాయపడడం భారత్​ విధి. అందుకే తనపై ఆధారపడిన నేపాల్, శ్రీలంక, భూటాన్ లాంటి దేశాలు విజ్ఞప్తి చేయడంతో ఈ ఔషధాలు ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం.​

also read అందుకోసం వారికి ప్లేట్లకు బదులు అరటి ఆకులలో అందిస్తున్నాము: ఆనంద్ మహీంద్రా

ఇలా పాక్షికంగా హైడ్రాక్సీ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
మలేరియా చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్​ను, కరోనా రోగులకు కూడా వాడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఈ ఔషధం ఎగుమతులపై భారత్​ నిషేధం విధించింది. ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు... మానవతా దృక్పథంతో వీటి ఎగుమతులపై పాక్షికంగా నిషేధాన్ని భారత్ ఎత్తివేసింది.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వల కొరత లేదు
దేశీయ విపణిలోకి అవసరమైన, సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వలు కేంద్రం మరోసారి వెల్లడించింది. ఈ ఔషధం కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) చైర్మన్ శుభ్రాసింగ్ శుక్రవారం తెలిపారు.

దేశీయ అవసరాలే తొలి ప్రాధాన్యం
దేశీయ అవసరాలే తమ తొలి ప్రాధాన్యం అని, మన అవసరాలు తీరిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేస్తామని ఎన్పీపీఏ చైర్మన్ శుభ్రాసింగ్ వెల్లడించారు. అయితే, వైద్యుల సలహా మేరకు వీటిని వాడాలని ఆమె ప్రజలకు సూచించారు.

70 శాతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఉత్పత్తి మనదేశంలోనే
ప్రపంచ దేశాలకు అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధంలో 70 శాతం భారతదేశమే ఉత్పత్తి చేస్తోంది. ఐపీసీఏ, జైడస్ క్యాడిలా వంటి సంస్థలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దేశీయ అవసరాలకు సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని, గతవారం భారత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తెలిపింది. ఎగుమతుల అవసరాలను తీర్చేందుకు తాము ఉత్పత్తిని పెంచుతామని పేర్కొన్నది. 

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకే ఎగుమతులు
ముందుగా విదేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఎగుమతిపై నిర్ణయం తీసుకుంటామని విదేశాంగశాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వ చేసిన తర్వాత ఔషధాలను ఎగుమతి చేస్తామని, దీనిపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) నిర్ణయం తీసుకుంటుందన్నారు.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధంతో చికిత్స ఇలా
మలేరియాతోపాటు రుమటాయిడ్ ఆర్దరైటిస్, లూపస్ వ్యాధుల చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం వాడతారు. కొవిడ్-19పై పోరాటానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాన్ని చాలా దేశాలు ‘గేమ్ చేంజర్’గా భావిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, కొన్ని ఐరోపా దేశాలు తమకు ఈ ఔషధం సరఫరా చేయాలని భారతదేశాన్ని కోరుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios