కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ వైరస్ ని ఎదురుకోవడానికి చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కాగా.. అసలు ఈ వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా, ఇటలీ, స్పెయిన్ లలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.

కరోనాని అరికట్టేందుకు దేశాలు అమలు చేస్తున్న నిబంధనలు మరింత కఠినతరంగా మారుతున్నాయి. నిత్యం  రద్దీగా ఉండే నగరాలన్నీ జనసంచారం లేక బోసిపోతున్నాయి. రైలు, నౌకలు ఆస్పత్రులుగా మారుతున్నాయి. 

Also read భర్తకి కరోనా.. లాక్ డౌన్ లో భార్య ప్రేమతో ఏం చేసిందంటే......

ఇదిలా ఉండగా.. అన్ని దేశాల్లో కంటే స్పెయిన్ లో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం అంత్యక్రియలపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం. సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిషేధించింది. ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులతో సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ  ఎవరూ హాజరుకావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలకు ప్రజలు సామూహికంగా వెళ్లొద్దని స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 11వ తేదీ వరకు అక్కడ లాక్ డౌన్ కొనసాగనుంది. 

ఇదిలా ఉండగా..ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. గతవారం పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన ప్రధాని.. ప్రతిపక్ష సభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు.

ఈ క్రమంలో వ్యక్తిగత సహాయకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో నెతన్యాహూతో పాటు మిగిలిన సిబ్బంది కూడా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు మీడియా కథనాలు ప్రచురించింది.

మరోవైపు ప్రధాని క్వారంటైన్‌కు వెళ్లారనే వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించింది. 

కాగా ఇజ్రాయిల్‌లో ఇప్పటి వరకు 4,347 మందికి కోవిడ్ 19, సోకగా వీరిలో 15 మంది మరణించి, 132 మంది కోలుకున్నారు.