హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంనాడు ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 5వ తేదీన నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం, టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై చర్చించింది.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. టెన్త్ పరీక్షల విషయంలో  హైకోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

హైద్రాబాద్ మహబూబియా కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ ఇవాళ ప్రారంభమైంది. ఇంటర్ రెండో సంవత్సరం జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల వాల్యూయేషన్ చేయనున్నారు.

also read:విద్యార్ధులకు భరోసా.. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు: సబితా ఇంద్రారెడ్డి

కరోనా నేపథ్యంలో 12 నుండి 33కి వాల్యూయేషన్ సెంటర్లను పెంచారు. జవాబు పత్రాలను దిద్దే లెక్చరర్ల మధ్య భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను ఈ సెంటర్లలో కల్పించనున్నారు.

రాష్ట్రంలో 9.50 లక్షల మంది విద్యార్థులు రాసిన 55 లక్షల జవాబు పత్రాలను లెక్చరర్లు మూల్యాంకనం చేయనున్నారు. పేపర్లు దిద్దే అధ్యాపకులకు మూడు మాస్కులతో పాటు వ్యక్తిగత శానిటైజర్లు, పోలీస్ పాసులు అందించారు.ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్, ఫాగింగ్ చేయనున్నారు. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.