హైదరాబాద్: హైద్రాబాద్‌లో ఉన్న ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులతో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు సమావేశం నిర్వహించారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని విద్యార్థులను, ఉద్యోగులను నిర్వాహకులు ఆదేశించడంతో మంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

హైద్రాబాద్‌లోని అమీర్ పేట, ఎస్ఆర్‌నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో హాస్టల్స్ లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని నిర్వాహకులు ఆదేశించడంతో బాధితులు ఎన్ఓసీ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు.

ఈ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించింది.దీంతో ఎన్ఓసీల జారీని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. హైద్రాబాద్ లో ఉన్న హాస్టల్స్ నిర్వాహకులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు ఉదయం సమావేశమయ్యారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడ పాల్గొన్నారు.

హాస్టల్స్ లో ఉండే వారిని బలవంతంగా స్వగ్రామాలకు వెళ్లాలని కోరవద్దని మంత్రి ఆదేశించారు. హాస్టల్స్ నిర్వాహకులకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుందని మంత్రి హామీ ఇచ్చారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని చెబితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. 

Also read:కరోనా దెబ్బకు ప్రముఖ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ మృతి

హాస్టల్స్ లో ఉంటున్నవారు ఎవరూ కూడ ఇబ్బంది పడకూడదని మంత్రి కోరారు. హాస్టల్స్ ఉండేవారి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు. 

బుధవారం నాడు ఒక్క రోజునే హైద్రాబాద్ పోలీసులు సుమారు 8  వేల ఎన్ఓసీ లు జారీ చేశారు. ఈ ఎన్ఓసీలను తీసుకొని ఏపీ రాష్ట్ర సరిహద్దులకు  వచ్చిన వారిని నిరాశే ఎదురైంది. ఎన్ఓసీలతో ఏపీ రాష్ట్ర సరిహద్దులకు వచ్చినవారిని పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

దీంతో నిరాశతో చాలా మంది హైద్రాబాద్ కు తిరిగి వెళ్లారు. కేవలం 44 మంది మాత్రమే ఏపీ రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చారు పోలీసులు. క్వారంటైన్ లో ఉంటామంటేనే  రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో చాలా మంది తిరిగి వెళ్లారు.