హైదరాబాద్: తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని కోరుతూ గురువారం నాడు ఉదయం హైద్రాబాద్ ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎన్ఓసీలను ఇవ్వడం మానివేసినట్టుగా పోలీసులు తేల్చి చెప్పారు.

Also read:కరోనా ఎఫెక్ట్: పొందుగుల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత, ఏపీలోకి నో ఎంట్రీ

గురువారం నాడు ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు ఎన్ఓసీ  కోసం భారీగా చేరుకొన్నారు. తమకు ఎన్ఓసీ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్ఓసీలు జారీ చేయడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా కూడ వారు వినలేదు. ఎన్ఓసీ కోసం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. హాస్టల్స్ మూసివేయడం లేదని స్పష్టం చేశారు. మాస్టల్స్ నిర్వాహకులకు కూడ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

బుధవారం నాడు ఒక్కరోజే తెలంగాణ పోలీసులు సుమారు 8 వేల ఎన్ఓసీలను జారీ చేశారు.తెలంగాణ పోలీసులు జారీ చేసిన ఎన్ఓసీల్లో ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి వెళ్లేవారే ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చేవారిని ఐసోలేషన్ ఉంటామని అంగీకరిస్తేనే ఏపీ సర్కార్ అనుమతిస్తామని చెప్పింది.అంతేకాదు ఈ విషయమై తెలంగాణ సర్కార్ తో ఏపీ అధికారులు మాట్లాడారు.దరిమిలా తెలంగాణ ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయడాన్ని నిలిపివేసింది.