హోం వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ బాలిక మృతి...

నిజామాబాద్ లో హోంవర్క్ సరిగా చేయలేదని కోపంతో టీచర్ ఓ చిన్నారిని చితకబాదింది. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

second class girl dies after being punished for not doing homework in nizamabad

నిజామాబాద్ : టీచర్ల కర్కశత్వానికి విద్యార్థులు బలవుతున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీచర్ ఇచ్చిన పనిష్మెంటుకు కాళ్లు కోల్పోయిన ఓ విద్యార్థి ఘటన మరువకముందే నిజామాబాద్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ కొట్టిన దెబ్బలకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే... 

పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడం అభం శుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది. తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఉపాధ్యాయురాలు.. రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. టీచర్ విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది.  చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్, అర్సపల్లిలోని ఫుట్ బ్రిడ్జ్ పాఠశాలలో మంతాష (7)  అలియాస్ ఫాతిమా రెండో తరగతి చదువుతోంది. 

ఫాతిమా హోం-వర్కు చేయకపోవడంతో గత శుక్రవారం ఓ టీచర్ విపరీతంగా కొట్టింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమా సోమవారం రాత్రి కన్ను మూసింది. ఫాతిమా అంత్యక్రియలను మంగళవారం నిజామాబాదులో పూర్తి చేశారు.

సరిగా లైన్లో నిలబడలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్, ప్రిన్సిపల్.. ఇద్దరి అరెస్ట్..

అయితే, ఫాతిమా మరణం గురించి తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు పాఠశాలవద్దకు చేరి ఆందోళనకు దిగారు.  టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఫాతిమామరణంతో తమకు సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం చెబుతోందని వారు ఆరోపించారు. ఫాతిమా మరణంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు చేసిన ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, చిన్నారి మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఫుడ్ బ్రిడ్జి పాఠశాలను సీజ్ చేయాలని డీఈఓ ఎన్వీ దుర్గాప్రసాద్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, తెలంగాణలో ఇలా ఓ టీచర్ అత్యుత్సాహం, మూర్ఖత్వంతో ఓ విద్యార్థి కాళ్లు కోల్పోయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లి.. హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. విద్యార్థినిపై హౌస్ టీచర్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది. పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పేరుతో ఐదు రోజుల పాటు ఆ విద్యార్థిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసింది. ఐదు రోజులు.. రోజూ ఎనిమిది గంట‌ల‌ పాటు.. హాస్టల్‌ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చ‌చ్చుబ‌డ్డాయి. ఆచేత‌నంగా మారిపోయాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న‌..ఆ విద్యార్థిని చికిత్స కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం రేగడ్డ మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక అనే అమ్మాయి వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే అస్వస్థతగా ఉండడంతో ఈ నెల 18వ తేదీన ఒకరోజు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆస్ప‌త్రిలో చూపించుకుని, రీక‌వ‌రి అయింది. ఆ త‌రువాత రెండు రోజులు ఆలస్యంగా 22వ తేదీన కాలేజీకి వ‌చ్చింది. దీంతో  మూడు రోజులు అధికంగా సెలవు తీసుకుందని హౌస్ టీచర్ కోపానికి వచ్చింది. విద్యార్థినిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

వచ్చిన రోజునుంచి ఐదురోజుల పాటు రోజూ దాదాపు ఎనిమిది గంట‌ల పాటు హాస్టల్‌ బయటే నిలబెట్టింది. కాలేజీకి కూడా వెళ్లనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని నిలబడి ఉండటంతో ఆమె కాళ్లు మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియడం లేదు. నడవలేనిస్థితిలో ఉన్న నిహారికను హాస్టల్‌ లోని ఆరోగ్య సిబ్బంది వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విష‌యం తెలుసుకున్న నిహారిక త‌ల్లిదండ్రులు అధ్యాపకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios