లాక్‌డౌన్ గడువు పెంపుపై ఆలోచిస్తున్నాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది.
న్యూఢిల్లీ: లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది.
బుధవారం నాడు ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది.
లాక్ డౌన్ ను పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలోనే లాక్ డౌన్ ను పొడిగించాలని ఆయన కోరిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
also read:విషాదం:గుజరాత్‌లో కరోనాతో 14 నెలల బాలుడి మృతి
కరోనా విషయంలో ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్టుగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ప్రధాని మోడీకి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా లాక్ డౌన్ పై ప్రధాని నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
కేంద్రమంత్రుల కమిటి లాక్ డౌన్ ను పొడిగించాలని సూచించినట్టుగా సమాచారం. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసింది. నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర సరుకులు, మందులను నిల్వ ఉంచుకోవాలని కూడ కేంద్రం కోరింది. ప్రధానమంత్రి మోడీ కరోనా విషయమై ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా బుధవారం నాడు సమావేశం నిర్వహించారు.